మొన్న శ్రీదేవి.. నేడు శ్రీవాణి.. పదవులకు అడ్డుగా మారిన కుల సమస్య

 

ఇటీవల తాడేపల్లి ఎమ్మెల్యే శ్రీదేవి తలనొప్పిగా మారిన కుల వివాదం ఇప్పుడు డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణికి చుట్టుకొంది. అతి చిన్న వయస్సులోనే జరిగిన క్యాబినెట్ లో డిప్యూటీ సీఎం గా పుష్పశ్రీవాణికి కుల వివాదం పెద్ద తలనొప్పిగా తయారైంది. కోర్టు నుంచి సైతం నోటీసులు రావడంతో ఏం జరుగుతుందోనని ఆమె అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. పాముల పుష్పశ్రీవాణి 2014 ఎన్నికల్లో కురుపాం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. శత్రుచర్ల కుటుంబం పై కుల వివాదం పై పోరాడిన నిమ్మక జయరాజు ఇప్పుడు శ్రీవాణి పై సైతం కోర్టు మెట్లెక్కారు. శ్రీవాణి కొండదొర కాదంటూ ఆయన ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో పాటు హైకోర్టు లో ఆధారాలు కూడా సమర్పించారు. దీంతో కోర్టు ఆమెకు నోటీసులు జారీ చేసింది. పుష్పశ్రీవాణి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండలం దొరమామిడి గ్రామం. ఇదే జిల్లాలో కోటసీతారాంపురం ఐటీడీఏ లో ఎస్టీ కోటాలో ఆమె సోదరి పాముల రామతులసి టీచర్ గా ఎంపికైన స్థానికుల ఫిర్యాదుతో ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు అధికారులు. ఈ విషయంలో కూడా కులమే పుష్పశ్రీవాణి సోదరికి అడ్డొచ్చింది. దీంతో పాటు పుష్పశ్రీవాణి పూర్వీకులు పాలకొండలో నివశించేవారిని వారి ఇంటిపేరు తమ కులాల్లో లేదని గిరిజన నేతలు వాదిస్తున్నారు. ఆమె సోదరి ఎస్టీ కాదని ఆధారాలు దొరకడంతో ఈ విషయం పై గిరిజన నేతలు కోర్టు మెట్లెక్కారు. విచారణ జరిపిన కోర్టు నోటీసులు ఇవ్వడంతో ఇప్పుడు ఆమె భవిష్యత్తు పై నీలి నీడలు కమ్ముకున్నాయి.మొత్తానికి కుల సమస్యతో అక్కడి వాతవరణం హీటెక్కింది.