భారత్ పాక్ యుద్ధం...తప్పదా ?

 

కాశ్మీర్ అంశంలో మోడీ సర్కార్ నిర్ణయాన్ని జీర్ణించుకోలేని పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు సిద్దమవుతుంది. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అధ్యక్షతన సమావేశమైన జాతీయ భద్రతా కమిటీ నిన్న కీలక నిర్ణయాలను తీసుకుంది. భారత్ దౌత్య సంబంధాలను తెంచేసుకోవాలని నిర్ణయించుకున్న పాక్ యుద్దానికి వెనుకాడొద్దని సైన్యానికి పరోక్ష అలర్ట్స్ పంపింది. లాహోర్-ఢిల్లీ మధ్య బస్సు సర్వీసును కూడా నిలిపివేసిన పాకిస్తాన్ వాఘా సరిహద్దును కూడా మూసివేయాలని ఆదేశించింది. 

ఆగష్టు 15ను బ్లాక్ డేగా నిర్వహించాలని, భారత్ హై కమిషన్ ను వెనక్కు పంపాలని, ఢిల్లీలోని పాక్ హైకమిషన్ ను వెనక్కు రావాలని ఆదేశాలిచ్చింది. ద్వైపాక్షిక  ఒప్పందాలను మరోసారి సమీక్ష చేసుకోవాలని.. కాశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్య సమితి దృష్టికి తీసుకెళ్లాలని ఈ సమావేశంలో నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది. ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు మృతి చెందిన ఘటన విషయంలోనే యుద్ధం వస్తుందని భావించినా పాక్ తేలు కుట్టిన దొంగలా ఉండిపోవడం వలన అది సద్దుమణిగింది. 

అయితే ఆర్టికల్‌-370ని మోదీ సర్కారు నిర్వీర్యం చేయడం భారత్‌-పాక్‌ మధ్య యుద్ధానికి దారితీయొచ్చని పాకిస్థాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ అన్నారు. పుల్వామా ఉగ్రదాడి తరహాలో భారత్‌లో మరిన్ని ఘటనలు చోటుచేసుకునే ప్రమాదముందని, కశ్మీరీలను ఎంత అణగదొక్కేందుకు ప్రయత్నిస్తే, తమ హక్కుల కోసం వారు అంతగా పోరాటం చేస్తారని ఆయన హెచ్చరించారు. 

కశ్మీరీలకు సాయం చేసేందుకు ఎంతదాకైనా వెళతామని, ఇందుకు తమ బలగాలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయని పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ కమర్‌ జావెద్‌ బజ్వా కూడా ప్రకటించారి. తాజాగా కమాండర్లతో సమావేశం నిర్వహించారు. కశ్మీరీలకు చివరి క్షణం వరకూ పాక్‌ సైన్యం అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఇదే సమయంలో పాకిస్థాన్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి ఫవద్ చౌదరి యుద్ధానికి వెనుకాడొద్దని, యుద్ధమంటే గెలుపోటముల కోసం చేసేది కాదని, గౌరవం కోసం, పరువు, ప్రతిష్ఠల కోసం చేసేదని చెప్పుకొచ్చారు. 

ఈ నేప‌థ్యంలో ప‌రిణామాలు ఎటువైపు దారితీస్తాయోనని భార‌త్‌, పాక్ ప్ర‌జ‌లు ఆసక్తిగా గ‌మ‌నిస్తున్నారు. ప్ర‌ధానంగా పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్‌ఖాన్ చేసిన ప్ర‌సంగాన్ని ఒక‌సారి గ‌మ‌నిస్తే.. ఇరుదేశాల మ‌ద్య యుద్ధం త‌ప్ప‌దేమోన‌ని ప్ర‌జ‌లు అనుకుంటున్నారు.  చూద్దాం ఏమవుతుందో ?