తోకముడిచి.. అంతలోనే కాల్పులు మొదలుపెట్టిన పాక్

 

కాల్పుల విరమణ ఒప్పందాన్ని యథేచ్చగా ఉల్లంఘిస్తూ భారత్ ను కవ్విస్తున్న పాక్ ఆర్మీకి భారత సైన్యం దీటుగా జవాబు ఇచ్చింది. భారత ఆర్మీ పోస్టులు, సరిహద్దు గ్రామాలపై బుల్లెట్ల వర్షం కురిపిస్తున్న పాక్ కుట్రను భారత్ తిప్పికొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు పాక్ రేంజర్లు చనిపోయారు. దీంతో శాంతికి, లొంగుబాటుకు చిహ్నమైన తెల్లజెండా చూపిస్తూ... పాక్ సైనికులు తమ సహచరుల మృత దేహాలను తీసుకెళ్లారు. ఇవాళ ఉదయం జమ్మూ కశ్మీర్లోని హాజీపూర్ సెక్టార్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది

సరిహద్దులో నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంట ఉన్న హాజీపూర్ సెక్టార్ లో భారత ఆర్మీ పోస్టులపై ఈ నెల 10,11 తేదీల్లో పాక్ బలగాలు భారీఎత్తున కాల్పులకు తెగబడ్డాయి. దీంతో భారత ఆర్మీ వారి కుట్రను దీటుగా తిప్పికొట్టింది. భారత్ తీవ్రంగా ప్రతిస్పందించడంతో పాక్ బలగాలు తోకముడిచాయి. భారత్ చేసిన దాడిలో పాక్ ఆర్మీలోని ఇద్దరు రేంజర్లు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆర్మీ నిబంధనల ప్రకారం పాక్ సైనికులు కొందరు తెల్లజెండాతో ముందుకు వచ్చారు. తెల్లజెండాను చూపితే కాల్చవద్దని అర్థం. దీంతో భారత బలగాలు తమనుతాము నియంత్రించుకున్నాయి. ఈ సందర్భంగా తమవారి మృతదేహాలను పాక్ తీసుకెళ్లింది. ఈ ఘటనకు సంబంధించి భారత ఆర్మీ విడుదల చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

కాగా తమ సహచరుల శవాలను తీసుకెళ్లిన కొద్ది సేపటికే పాక్ రేంజర్లు ఇవాళ మళ్లీ కాల్పులు మొదలు పెట్టారు. జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్ జిల్లా బాలాకోట్, మెందార్ సెక్టార్లలో పాక్ సైన్యం కవ్వింపు చర్యలకు దిగింది. ఎల్వోసీ వద్ద పహారా కాస్తున్న భారత సైనికులు పాక్ కాల్పులను సమర్థంగా తిప్పికొడుతున్నారు.