నొప్పిమాత్రలతో గుండెపోటు

నొప్పి రానివాడు, వచ్చాక అది త్వరగా తగ్గిపోతే బాగుండు అనుకోనివాడు ఈ ప్రపంచంలో ఉండడు. కానీ బజారులో దొరుకుతున్నాయి కదా అని ఎడాపెడా నొప్పిమందులను వాడేస్తే అవి మన గుండెకే చేటు అని చెబుతున్నారు ఇటలీకి చెందిన కొందరు పరిశోధకులు. 

తరచూ తీసుకునేవే నొప్పి నివారణ కోసం రోగులు సాధారణంగా రెండురకాల మందులను వాడతారు. ఒకటి- అనాదిగా వాడుతున్న Non-selective non-steroidal anti-inflammatory drugs (NSAID). ఇబూప్రొఫెన్‌, డైక్లోఫెనాక్‌ వంటి మందులు ఈ కోవలోకి వస్తాయి. రెండు- COX-2 inhibitors. సెలకోక్సిబ్‌, రెఫెకోబ్సిబ్‌ వంటి మందులు ఈ విభాగంలోకి వస్తాయి.

వినడానికి ఈ మందుల పేర్లనీ మనకి అయోమయంగా ఉండవచ్చు. కానీ బ్రూఫిన్, వోవరాన్‌ వంటి వందలాది బ్రాండ్ల పేరుతో అవి మనకు సుపరిచితమే! ఇంకా మన నోటి మీదే నిత్యం ఆదే ‘కాంబిఫ్లామ్‌’ వంటి కాంబినేషన్‌ మందులలో కూడా వీటి ఉనికి ఉంటుంది.


లక్షలమంది మీద పరిశోధన మనం రోజువారీ విచ్చలవిడిగా వాడేసే ఈ నొప్పి మందులు మన ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలుసుకొనేందుకు, ఐరోపాలోని కోటిమందిని పరిశీలించారు పరిశోధకులు. 2000 నుంచి 2010 సంవత్సారాల వరకూ ఈ నొప్పి నివారణ మాత్రలను వాడుతూ వస్తున్న రోగులను ఇందుకోసం ఎంచుకొన్నారు. కీళ్లనొప్పులు వంటి ఇబ్బందులను ఎదుర్కొనేందుకు వీరంతా కూడా నొప్పి మాత్రలను వాడుతూ వస్తున్నారు. వాపులతో కూడిన నొప్పులని నివారించేందుకు వైద్యులు ఈ మందలును తప్పకుండా సూచిస్తూ ఉంటారు. 


గుండెజబ్బులు
నొప్పి నివారణ మాత్రలను వాడుతున్నవారిలో 92,163  మంది గుండెపోటుతో ఆసుపత్రిలో చేరడాన్ని గమనించారు పరిశోధకులు. వీరిలో 19 శాతం మంది ఓ రెండువారాలు నొప్పి మాత్రలను వాడగానే, ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. ఎంత వృద్ధులైనప్పటికీ మరీ 19 శాతం మంది మాత్రలను వాడిన కొద్దిరోజులకే ఆసుపత్రిలో చేరడం అనేది ఆలోచించాల్సిన విషయమే! పైగా వాడుతున్న మాత్రనిబట్టి 16 శాతం నుంచి 83 శాతం వరకూ గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటోందని తేలింది. సాధారణంగా పెద్దవారిలో కీళ్లనొప్పులు సాధారణం కాబట్టి, వీటి కోసం వాడే మందులు వారి ఆయుష్షునే దెబ్బతీయడం బాధాకరం.


తగిన జాగ్రత్తలు
చాలావరకు నొప్పినివారణ మాత్రలు మార్కెట్లో ఎడాపెడా దొరికేస్తూ ఉంటాయి కాబట్టి, ఇవి సురక్షితమే అన్న అపోహలో ఉంటారు ప్రజలు. కానీ దుష్ఫలితాలు లేని మందులంటూ ఉండవన్న విషయాన్ని వారు గుర్తెరగాలి. రక్తపోటు, గుండెజబ్బులు వంటి అవకాశాలు ఉన్నవారు ఈ మందులను వాడేటప్పుడు మరింత జాగ్రత్తగా మెలగాలి. ఎప్పుడన్నా మరీ భరించలేని నొప్పి ఉన్నప్పుడు, అది కూడా తగిన మోతాదులోనే... నొప్పి మాత్రలను వేసుకోవాలి. అన్నింటికీ మించి ఇటు వైద్యులూ, అటు ఆరోగ్య సంస్థలూ ఇలాంటి దుష్ఫలితాలు గురించి మరింత అవగాహన కల్పించాలి.

 

- నిర్జర.