కండువాను మార్చినంత సులభంగా పార్టీ మార్చేశారు

 

తెలంగాణ రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.బీజేపీ లో చేరిన మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ సతీమణి పద్మినీ రెడ్డి యూటర్న్ తీసుకొని మళ్ళీ సొంత గూటికి చేరారు.రాజకీయాల్లోకి రావాలి అని ఆసక్తి కనబరిచిన పద్మినీ రెడ్డి మానవ అక్రమ రవాణాలో జైలుకు వెళ్లిన జగ్గారెడ్డి స్థానంలో తనకు టిక్కెట్టు వస్తుందేమోనని ఆశపడ్డారు.అయితే కాంగ్రెస్‌ మాత్రం జగ్గారెడ్డికి టిక్కెట్టు ఇచ్చేందుకే మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది.దీంతో, కాంగ్రెస్ లో ఉండి లాభం లేదని నిర్ణయించుకున్న పద్మినీరెడ్డి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ల సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు.ఈ సందర్బంగా ప్రధాని మోదీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితురాలినై భాజపాలో చేరానని చెప్పారు.పద్మినిరెడ్డి చేరిక రాష్ట్ర భాజపాకు బలాన్నిస్తుందని భావిస్తున్న నేపథ్యంలో ఆమె అనూహ్యంగా కాంగ్రెస్ గూటికి చేరి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.

 

 

పద్మినీ రెడ్డి బీజేపీలో చేరిన సమయంలో దామోదర పుల్కల్‌ మండలం శివ్వంపేట గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఉన్నారు.భార్య పార్టీ మారిన విషయం తెలిసిన వెంటనే ఆయన ప్రచారాన్ని అక్కడితో కట్టిపెట్టి హుటాహుటిన హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు.పద్మినీ రెడ్డి బీజేపీలో చేరినట్టు తెలుసుకున్న ఆందోల్‌ నియోజకవర్గ కార్యకర్తలందరూ సంగారెడ్డి చౌరస్తాలోని దామోదర్‌ నివాసానికి చేరుకున్నారు.ఆమెను కాంగ్రెస్ లోకి తిరిగి తీసుకురావాలని దామోదర్‌ వద్ద పట్టుపట్టారు.పద్మినీ రెడ్డి తో మాట్లాడిన దామోదర్ కాంగ్రెస్ లోకి రాకపోతే తాను కూడా పార్టీకి రాజీనామా చేస్తానని,ఈ ఎన్నికల్లో పోటీ చేయబోనని అన్నట్లు సమాచారం.కాంగ్రెస్ లోనే సముచిత ప్రాధాన్యం లభించేలా చూస్తానని పద్మినీరెడ్డికి దామోదర్‌ భరోసా ఇవ్వడంతో ఆమె తన నిర్ణయం మార్చుకొని సొంత గూటికి చేరినట్టు తెలుస్తోంది.రాత్రి సంగారెడ్డిలోని తమ నివాసంలో  విలేకరులతో ఆమె మాట్లాడుతూ కార్యకర్తల మనోవేదనను అర్థం చేసుకుని తిరిగి వెనక్కు వచ్చేస్తున్నానని చెప్పారు.కార్యకర్తల అభిప్రాయం మేరకు కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.భాజపాలో చేరిక అనుకోకుండా జరిగిందన్నారు.అనంతరం ఆమె కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు.దీంతో రాజకీయాల్లో ‘కండువాను మార్చినంత సులభంగా పార్టీ మార్చేశారు' అనే మాటను పద్మినీ రెడ్డి నిజం చేశారు.