విపక్షాల ఐక్యతను చాటిన డీఎంకే కార్యక్రమం


చెన్నైలో దివంగత డీఎంకే నాయకుడు కరుణానిధి నిలువెత్తు విగ్రహావిష్కరణ వేడుక జరిగింది. తేనాంపేటలోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయం ఆవరణలో ప్రతిష్టించిన కరుణానిధి కంచు విగ్రహాన్ని యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆవిష్కరించారు. కేరళ,పుదుచ్చేరి, ఏపీ సీఎంలు  పి.విజయన్, నారాయణస్వామి, చంద్రబాబు నాయుడు, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత చిదంబరం, సినీ నటుడు రజనీకాంత్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  అనంతరం బహిరంగ సభలో వారంతా ప్రసంగిస్తూ మోదీ సర్కారుపై ధ్వజమెత్తారు. రాహుల్‌ ప్రసంగిస్తూ దేశాన్ని ఒక్క భావజాలమే నడపాలని భాజపా ప్రభుత్వం విశ్వసిస్తోందన్నారు. దేశ సంస్కృతినే కాకుండా సుప్రీంకోర్టు, రిజర్వ్‌ బ్యాంకు, ఎన్నికల సంఘం వంటి వ్యవస్థల్నీ మోదీ సర్కారు లక్ష్యంగా చేసుకొంటోందని ఆరోపించారు. దేశంలోని శక్తులన్నీ కలిసి, వచ్చే ఎన్నికల్లో భాజపాని ఓడించడం ఖాయమన్నారు.

 

 

కరుణానిధి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ దేశానికి ప్రధాని అయ్యే అన్ని అర్హతలు రాహుల్‌ గాంధీకి ఉన్నాయని, తమిళనాడు నుంచి ఆ పదవికి ఆయన పేరును దివంగత కరుణానిధి వారసుడిగా ప్రతిపాదిస్తున్నట్టు డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ ప్రకటించారు. విపక్ష నేతలంతా చేతులు కలిపి ప్రజాస్వామ్య దీపాన్ని వెలిగిద్దామని ప్రతిపాదించారు. చంద్రబాబు మాట్లాడుతూ... ఎన్డీయే, భాజపా ప్రభుత్వాలకు ఎవరైనా మద్దతిస్తారా? అని సభికులను ప్రశ్నించారు. ఎన్డీయే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన విభజన హామీలను తుంగలో తొక్కిందన్నారు. వాటిని అడిగినందుకు తమపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. సీబీఐ, ఈడీ, ఆర్‌బీఐ, సుప్రీంకోర్టు తదితర వ్యవస్థలను దుర్వినియోగం చేస్తోందని దుయ్యబట్టారు. ఈవీఎంలనూ తారుమారు చేసే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు.