సచివాలయం కూల్చివేతపై విరుచుకుపడిన విపక్షాలు

చరిత్రలో చీకటి రోజు - ఉత్తమ్
సచివాలయం కూల్చివేతపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు లో విచారణకు తీసుకునే లోపే కూల్చివేయడం అన్యాయమని రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 132ఏండ్ల చరిత్ర ఉన్న సచివాలయాన్ని కూల్చివేసిన ఈ రోజు చరిత్రలో చీకటిరోజు అన్నారు. కేసీఆర్ మూఢ నమ్మకానికి కోట్లాది రూపాయల ప్రజాధనం వృద్ధా అవుతుందని ఆయన విమర్శించారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి ఖజానా ఖాళీగా ఉందని చెప్పే సిఎం 500 కోట్లను ఎక్కడి నుంచి తీసుకువస్తారని, ప్రస్తుత తరుణంలో కొత్త సచివాలయం అవసరమా? అని ప్ర‌శ్నించారు. ఒక్క కుటుంబ అవసరాల కోసం తెలంగాణ ప్రజలందరినీ ఇబ్బంది పెడుతున్నారని ఆయన విమర్శించారు.

సచివాలయానికే రాని సిఎంకు కొత్త సచివాలయం ఎందుకు?..
ప్రజలు ప్రాణాలు గాలికి వదిలేసి కోట్లాది రూపాయల ప్రజాధనం వృద్ధా చేస్తున్నారు..
రాష్ట్రంలో నిజాం నాటి నిరంకుశ పాలన..
- బిజెపి ఎంపి బండి సంజయ్

సచివాలయం 132ఏండ్ల చరిత్ర గల సచివాలయాన్ని రాత్రికి రాత్రి కూలగొట్టడం దుర్మార్గమైన చర్య అన్నారు బిజేపీ ఎంపి బండి సంజయ్. రాష్ట్రంలో నిజాం పాలన నాటి నిరంకుశ ,నియంతృత్వ పాలన కొనసాగుతోందని విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిపాలనకు, సరిపోయే విధంగా కట్టిన ఈ బిల్డింగ్ ను చాదస్తంతో ప్రవర్తిస్తూ…రాత్రికి రాత్రే కూలగొట్టడం మతిలేని చర్య అన్నారు. 132 ఏండ్ల చరిత్రగల భవనాలను నేలమట్టం చేయడం, కోట్లాది రూపాయల ప్రజా ధనం వృధా చేయడం నిరంకుశ చర్య అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తుంది.  కరోనా బారినపడిన ప్రజలు ఆసుపత్రులు లేక , సరైన వైద్య సదుపాయం లేవు.  ప్రైవేటు కార్పోరేట్ ఆస్పత్రుల దోపిడీతో అల్లాడుతున్నారు. ఇలాంటి సమయంలో వైద్య పరీక్షలు నిర్వహించి ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన ప్రభుత్వం సచివాలయం కూల్చివేతపై ఆగమేఘాలమీద నిర్ణయాలు తీసుకోవడం విడ్డూరమ‌న్నారు.

తిరుగుబాటు ఎదుర్కొనే రోజు వస్తుంది - విజయశాంతి
సీఎం కేసీఆర్ తప్పులు పెరిగిపోతున్నాయి. ప్రజలను పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని సినీ నటి విజయశాంతి విమర్శించారు. ప్రజల తిరుగుబాటు ఎదుర్కొనే రోజులు త్వరలోనే ఉన్నాయన్నారు.

ప్రజలు కరోనాతో అల్లాడుతుంటే కూల్చివేతలు అవసరమా - డికె అరుణ
రాష్ట్రంలో ప్రజలు అల్లాడుతుంటే సచివాలయం కూల్చివేత అవసరమా అంటూ బిజెపి జాతీయ ప్రతినిధి, మాజీ మంత్రి డికె అరుణ ప్రశ్నించారు. ఒక రోజు కూడా సచివాలయానికి వెళ్ళని కేసీఆర్ కు సచివాలయం ఎందుకని ఆమె ఎద్దేవా చేశారు.