రాష్ట్రంలో హడావుడి చేస్తున్న ప్రతిపక్షాలు

 

ఈ రోజు ప్రతిపక్ష పార్టీలు తెదేపా మరియు తెరాసలు వేర్వేరు ప్రాంతాలలో సభలు నిర్వహించుకొంటుండగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయలక్ష్మి తెలంగాణాలో తన పార్టీని విస్తరించి, బలపరుచుకొనే ప్రయత్నంలో ఈరోజు నుండే తెలంగాణా ప్రాంతంలో పర్యటనకు బయలుదేరుతున్నారు. ఈ మూడు పార్టీలు ఒకేరోజున తమ కార్యక్రమాలు నిర్వహించుకోవడం యాదృచ్చికమే అయినా మూడింటికీ చాలా ప్రాముఖ్యత ఉంది.

 

చంద్రబాబు నాయుడు తన పార్టీకి పునర్వైభవం తెచ్చే ప్రయత్నంలో చేపట్టిన తన సుదీర్గ పాదయాత్రను ఈ రోజు ముగించుకొంటున్న సందర్భంగా సాయంత్రం విశాఖలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. దీనికి దాదాపు 5లక్షల మంది తరలి వస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. చాలా రోజుల తరువాత పార్టీ ఇంత అట్టహాసంగా భారీ కార్యక్రమం చెప్పటడంతో పార్టీ శ్రేణుల్లోఇప్పుడు నూతన సమరోత్సాహం వెల్లివిరుస్తోంది.

 

ఇక, తెరాస ఆవిర్భవించి నేటికి సరిగ్గా 12సం.లు పూర్తయిన సందర్భంగా ఈ రోజు సాయంత్రం నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో ఆ పార్టీ కూడా ఒక భారీ బహిరంగసభ నిర్వహిస్తోంది. గత 12సం.లుగా తెరాస ఎన్నడూ అధికారం చెప్పట్టకపోయినప్పటికీ, కేవలం ఉద్యమాలే ఊపిరిగా చేసుకొని, పార్టీ శ్రేణులను ఇంత సుదీర్గ కాలం ఏకత్రాటిపై నడపడం సామాన్యమయిన విషయం కాదు.

 

ఇటువంటి సమయంలో పార్టీ అధినేత కేసీఆర్ అకస్మాత్తుగా తన పంధా మార్చుకొని, ఎన్నికలలో పోటీ చేసి పార్టీకి ఎక్కువ సీట్లు సాదించడం ద్వారా తెలంగాణా సాదిద్దామనే కొత్త ప్రతిపాదన చేయడంతో, నేటి సభకు చాలా ప్రాముఖ్యత ఏర్పడింది. మళ్ళీ తెరాస అధ్యక్షుడిగా ఎన్నికయిన చంద్రశేఖర్ రావు తన నేతృత్వంలో ఎన్నికలను ఎదుర్కోనున్న తెరాస శ్రేణులకు ఈ సభలో బహుశః దిశా నిర్దేశం చేసి, ఎన్నికలకి సమార శంఖం పూరించవచ్చును. అదే సమయంలో తెలంగాణ సాదన కోసం తన భావి ప్రణాళికలను కూడా ప్రకటించవచ్చును.

 

ఇక, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ కూడా తెలంగాణా ప్రాంతంలో తమ పార్టీని బలోపేతం చేసుకొని మరింత వ్యాపింపజేసేందుకు ఈ రోజునుండే ఆమె తెలంగాణలోరచ్చబండ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇంతవరకు, తన కొడుకు జగన్ మోహన్ రెడ్డి త్వరలో జైలు నుండి విడుదలయి, పార్టీ కార్యకలాపాలను స్వయంగా చూసుకొంటాడని భావిస్తూ ఎదురు చూసిన విజయమ్మగారు, ఇక ఆయన ఇప్పుడప్పుడే విడుదల అయ్యే సూచనలు కనబడకపోవడంతో ఆమె స్వయంగా నడుం బిగించి యాత్రలకు బయలు దేరక తప్పలేదు.

 

మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి నిర్వహించిన ‘ప్రజా ప్రస్థానం’కు ఈరోజుతో 10సం.లు పూర్తయిన సందర్భoగా ఆమె కూడా తన భర్తకు అచ్చొచ్చిన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల తన రచ్చబండ కార్యక్రమాలు మొదలుపెడతారు.

 

ఈవిధంగా మూడు ప్రధాన ప్రతిపక్షాలు తమ పార్టీలను పునరుజ్జీవింపజేసుకొని, అధికారం కైవసం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తుండగా, రాష్ట్రంలో అధికారం చెలాయిస్తున్న కాంగ్రెస్ పార్టీ మాత్రం వాటిని చాలా తేలికగా తీసిపారేస్తోంది. కానీ, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇటీవల ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మరియు పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణలను “రాష్ట్రంలో ప్రజల మీద ప్రతిపక్ష పార్టీల ప్రభావం ఏవిధంగా ఉంది? వారు ప్రభుత్వానికి వ్యతిరేఖంగా చేస్తున్న ప్రచారం వలన రాబోయే ఎన్నికలలో పార్టీ మీద ఏవిధంగా, ఎంత ప్రభావం ఉంటుంది?” వంటి ప్రశ్నలు సందించడం చూస్తే, రాష్ట్ర కాంగ్రెస్ కంటే, కాంగ్రెస్ అధిష్టానమే అప్రమత్తంగా ఉన్నట్లు అర్ధం అవుతోంది. ఆయన సందించిన ప్రశ్నలు గమనిస్తే రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను చూసి కాంగ్రెస్ అధిష్టానం చాలా ఆందోళనచెందుతున్నట్లు అర్ధం అవుతోంది.

 

కానీ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం అధికారం చేప్పటి దాదాపు 18నెలలు గడుస్తున్నపటికీ, ఇంతవరకు స్వంతపార్టీ వారితోనే ఎవరితోనూ సక్యత, నమ్మకం సాదించలేక అమ్మ హస్తం పట్టుకొని ఒంటరిగా ఇందిరమ్మ (పగటి) కలలు కంటున్నారు.