తోక పార్టీల కీచులాటలు

 

కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేఖంగా రెండు ప్రధాన ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చినందున, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని తెలుగు దేశం పార్టీ తన సభ్యులకు నిన్న విప్ జారీ చేసింది.

 

తమని తోక పార్టీలని గేలిచేసిన చంద్రబాబుపై మండిపోతున్న తెరాస, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు ఆ పార్టీ విప్ కూడా జారీ చేయడంతో మరింత మండిపడుతూ, “ప్రభుత్వం పడిపోకుండా కాపాడుకోవడానికే చంద్రబాబు నాయుడు ఇప్పుడు విప్ కూడా జారీ చేసారు. మమల్ని తోక పార్టీలని గేలిచేసిన చంద్రబాబు ఇప్పుడు విప్ జారీ చేయడం ద్వారా తానే కిరణ్ కుమార్ రెడ్డికి తోకనని నిరూపించుకొన్నారు ” అంటూ దుయ్యబట్టాయి.

 

"ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అసమర్దుడని, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అసమర్ధ ప్రభుత్వమని నిత్యం నిందించే చంద్రబాబు మరిప్పుడు అదే ప్రభుత్వాన్ని కాపాడేందుకు ఎందుకు ఇంత తాపత్రయ పడుతున్నారు?" అని తెరాస, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు నిలదీస్తే, దానికి జవాబుగా తెలుగు దేశం పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ “మీరు ఇద్దరూ చేతులు కలిపి కిరణ్ సర్కారును కూలదోస్తామని ప్రతిజ్ఞలు చేసి, ఇప్పుడు ఇద్దరూ వేర్వేరుగా అవిశ్వాస తీర్మానాలు పెట్టి, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్నికాపడట్లేదా?” అని ఎదురు ప్రశ్న వేసారు.

 

మొత్తం మీద మూడు ప్రధాన ప్రతిపక్షాలు కూడా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్నితమ రాజకీయ ప్రయోజనాల కోసం ఎంతగా నిందించినప్పటికీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పడిపోకూడదని కోరుకొంటున్నాయని తమ మాటలతో, తమ (అ)విశ్వాస తీర్మానాలతో స్పష్టం చేసాయి.