తెరాస 'ఆపరేషన్ ఆకర్ష్'

 

తెలంగాణాలో తెరాస అధికారంలోకి వచ్చాక 'ఆపరేషన్ ఆకర్ష్' కు తెరలేపింది.ఆపరేషన్ ఆకర్ష్ అంటే పక్క పార్టీ లో ఉన్న కీలక నేతలను తమ పార్టీలోకి లాగేసుకునే ప్రయత్నం చేసి విజయం సాధించింది.అంతేకాకుండా ఆయన మంత్రి వర్గంలో ఉన్న మంత్రులు సగానికిపైగా పక్క పార్టీల నుంచి వచ్చిన కీలక నాయకులే.ఇంతవరకు బాగానే ఉంది కానీ తెరాస అసెంబ్లీ రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు తెరలేపటంతో పాటు 105 మంది అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటించింది.దీంతో కొంత మంది తమకు అన్యాయం జరిగిందని అసంతృప్తి వ్యక్తం చేస్తూ పక్క పార్టీల వైపు చూస్తున్నారు.ఓ పక్క అసంతృప్తి వ్యక్తం చేస్తున్ననాయకులను కేటీఆర్ బుజ్జగిస్తూ వస్తుంటే మరో పక్క వలసలు మాత్రం ఆగట్లేదు.

పార్టీలోని కీలకనేతలే పార్టీ  మారితే క్యాడర్ చీలిపోద్దని గెలుపుపై దాని ప్రాభవం పడే అవకాశం ఉందని తెరాస భావిస్తుంది.దీంతో నేతలు ఎలాగో పార్టీ మారారు కనీసం క్యాడర్ ని అయినా కాపాడుకోవాలనే ఆలోచనలో పడింది తెరాస.ఇందులో భాగంగానే తిరిగి  'ఆపరేషన్ ఆకర్ష్' ని తెర మీదకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.ఆ పార్టీ నేత హరీష్ రావు దీన్ని అమలు చేసే పనిలో పడ్డట్లే ఉన్నాయి తాజా పరిణామాలు.కొన్ని రోజుల క్రితం కొందరు తెరాస నాయకులు కాంగ్రెస్ కండువాలు కప్పుకోగా వాళ్ళతో భేటీ అయిన హరీష్ రావు వాళ్ళని సముదాయించటంతో మరుసటి రోజే తిరిగి తెరాసలో చేరారు.తాజాగా ఓ మాజీ ఎంపీపీ కాంగ్రెస్ కండువా కప్పుకోగా హరీష్ రావు ఆయన ఇంటికి వెళ్లి మరి తెరాస కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు.ఇవాళ ఓ పార్టీలో ఉన్న వాళ్ళు రేపు మరో పార్టీలో ప్రత్యక్షమవుతారు.ముఖ్యంగా ఎన్నికల సమయం వచ్చిందంటే ఓ పార్టీ నుంచి మరోపార్టీకి నేతలు మారడం షరామామూలే.గెలుపే లక్ష్యంగా దూసుకుపోతున్న తెరాసకి ఈ వలసలు ముందరి కాళ్లకు భందం వేస్తుంటే ఆ పార్టీ వ్యూహమైన 'ఆపరేషన్ ఆకర్ష్' పార్టీని ఎంతవరకు నెట్టుకొస్తుందో వేచి చూడాల్సిందే..!!