విదేశాల్లో గృహహింస కేసులకు తెలంగాణ ఎన్ఆర్ఐ సెల్ ద్వారా పరిష్కారాలు

ఎన్ఆర్ఐ గృహహింస కేసుల వివాదాలకు చెక్..
360కోణాల్లో కేసులను పరిశీలిస్తున్న ఉమెన్ సేఫ్టీ వింగ్..
విదేశాల్లో గృహహింస కేసులకు తెలంగాణ ఎన్ఆర్ఐ సెల్ ద్వారా పరిష్కారాలు..
యువతులను రక్షించడమే లక్ష్యంగా ఉమెన్ సేఫ్టీ వింగ్ ప్రత్యేక శ్రద్ద..
నిందితులు ఎక్కడ ఉన్నా వివరాలు తెలుసుకునే ప్రయత్నం..
వెబినార్ ద్వారా విచారణ..

ఐదెంకల జీతం,  విదేశాల్లో విలాసవంతమైన జీవనంపై ఆసక్తిలో కొందరు, అమ్మాయి జీవితం బాగుంటుందని ఆశపడిన మరికొందరు ఎన్ఆర్ఐల సంబంధాలపై మక్కువ చూపిస్తారు. తీరా భారీ కట్నకానుకలతో పెండ్లి అయిన తర్వాత భార్యకు వీసా పంపిస్తామని ఉడాయించే వారు కొందరైతే దేశం కాని దేశం తీసుకువెళ్లి చిత్రహింసల పాలు చేసేవారు మరికొందరు ఉంటారు. ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్న ఈ ఎన్ఆర్ఐ పెండ్లికొడుకులను ఏమీ చేయలేక కుమిలిపోయే తల్లిదండ్రులకు ఊరట కలిగిస్తోంది తెలంగాణ ఉమెన్ సేప్టీ వింగ్.

ప్రత్యేకంగా ఎన్ఆర్ఐ విభాగాన్ని...
ఉమెన్ సేఫ్టీ వింగ్ లో ఎన్నారై ల గృహహింస కేసుల నమోదు, పరిష్కారం కోసం  గత ఏడాది జూలై 17న ప్రత్యేకంగా ఎన్నారై సెల్ ను ఏర్పాటు చేశారు. ఎన్ఆర్ఐ జీవిత భాగస్వాములు, బంధువులను నిందితులుగా పేర్కొన్న ఎన్ఆర్ఐ కేసులను పరిష్కరించడం కోసం ప్రత్యేకంగా ఈ విభాగాన్ని ఏర్పాటు చేశారు.  గత నాలుగైదు ఏండ్ల నుంచి రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో నమోదు అయినా ఇప్పటికీ పరిష్కారం కాకుండా పెండింగ్ లో ఉన్న కేసులను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఫిర్యాదుదారుల నుండి ఎన్ఆర్ఐ సెల్ పిటిషన్లను స్వీకరించి, కేసుకు సంబంధించిన  పూర్తి సమాచారాన్ని నిర్ణీత ఫార్మెట్ లో భద్రపరుస్తారు. సంబంధిత దర్యాప్తు అధికారులు, నిపుణుల బృందం  నిందితుల వివరాలన్ని సేకరిస్తారు. అయితే గతంలో ఎన్ఆర్ఐ జీవితభాగస్వామిపై ఫిర్యాదు చేస్తే పరిష్కారం లభించేది కాదు. ఉమెన్ సేఫ్టీ వింగ్ అడిషనల్ డిజిపి, ఐపిఎస్ అధికారి స్వాతిలక్రా ఈ కేసులు పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు. ఎన్ఆర్ఐ ఫిర్యాదులపై న్యాయసూచనలు తీసుకుంటూ విదేశీ వ్యవహారాల శాఖ, రాయబారి కాార్యాలయాల అధికారులతో, జాతీయ మహిళా కమిషన్, కేంద్ర, రాష్ట్ర మహిళా సంక్షేమ శాఖ, ఎన్జీవోలతో సంప్రదింపులు జరిపి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఎల్ఓసి(లుక్ అవుట్ సర్క్యులర్) జారీ చేసి మరీ నిందితులను రప్పించే ప్రయత్నం చేస్తున్నారు.

వెబినార్ ద్వారా..
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కారణంగా అనేక కేసుల విచారణ వాయిదా పడింది. అయితే అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వెబినార్ ద్వారా ఎన్ఆర్ఐ కేసులను విచారిస్తున్నారు ఉమెన్ సేఫ్టీ వింగ్ అధికారులు. విదేశాల్లోనూ ఈ కేసుల పరిష్కారం కోసం పనిచేసే వివిధ సంస్థల సహాయంతో త్వరితగతిన కేసులను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. వెబినార్ ద్వారా ఎన్నారై కేసుల్లో బాధితుల హక్కులను వివరిస్తున్నారు. విదేశాల్లో నివసిస్తున్న నిందితులపై చట్టపరంగా తీసుకోవల్సిన చర్యలపై దృష్టి సారిస్తున్నారు.
మంగళవారం ఉమెన్ సేఫ్టీ వింగ్ అడిషనల్ డిజిపి స్వాతి లక్రా, డిఐజి సుమతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఒకరోజు ఆన్ లైన్ వర్కషాప్ లోయునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన ఉమెన్ ఎంపవర్‌మెంట్ నెట్‌వర్క్ (WEN)  ఎన్జీఓ కౌన్సిలర్ గీతా మోర్లా, చికాగోలోని కమ్యూనిటీ లీడర్ చాందిని ఎన్నారై బాధితుల సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు.  "మాడాడ్" పోర్టల్ ను ఉపయోగించుకోవడంలో అనుసరించాల్సిన విధానాల గురించి తెలియజేశారు.

80 కేసుల్లో బాధితులు..

ఉమెన్ సేఫ్టీ వింగ్ నిర్వహించిన వెబినార్ లో ఎన్‌ఆర్‌ఐ సెల్, ఉమెన్ సేఫ్టీ వింగ్ వద్ద నమోదు అయిన 101  పిటిషన్ దారుల్లో 80మంది బాధితులు పాల్గొన్నారు. వారి కేసులు సత్వరంగా పరిష్కారం కావడానికి తీసుకోవల్సిన చర్యలపై చర్చించారు.  ఎన్ఆర్ఐ విభాగం జిఏడి చిట్టిబాబు, ఎసిపిలు అపర్ణ, డానియల్, లీగల్ అడ్వరైజర్లు పార్వతి, నంద, తారాశర్మ,  తరుణి ఎన్జీవో మమతారఘువీర్, దాదాపు 45మంది ఎస్ఐ, సిఐలు, 80మందికి పైగా బాధితులు ఈ వెబినార్ లో పాల్గొన్నారు.

ఎక్కడైనా ఫిర్యాదు చేయవచ్చు..
ఉమెన్ సేఫ్టీ వింగ్ ఎన్ఆర్ఐ గృహహింస కేసుల కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసిందని డిఐజి సుమతి చెప్పారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా గృహహింస చట్టం 498ఏ కింద ఎన్ఆర్ఐపై 574 కేసులు నమోదు కాగా ఇందులో 417 కేసులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 17 మహిళా పోలీస్ స్టేషన్లలో నమోదు అయ్యాయి. ఇప్పటివరకు ఎన్ఆర్ఐ సెల్, ఉమెన్ సేఫ్టీ వింగ్ లో101 పిటిషన్లు వచ్చాయి. ఇందులో 6 కేసుల్లో ఎన్నారై జీవిత భాగస్వాముల పాస్‌పోర్ట్‌లు స్వాధీనం చేసుకున్నాం.  మరో8 కేసులలో ఎన్నారై జీవిత భాగస్వాములపై ఎల్‌ఓసిలు జారీ చేశాం. 7 కేసులలో ఎన్‌ఆర్‌ఐ జీవిత భాగస్వాముల పాస్‌పోర్ట్‌లు కోర్టులో జమ చేశారు. 44 కేసులలో యజమాని వివరాలు సేకరించాం. ఎన్‌ఆర్‌ఐ నిందితుల విచారణకు చట్టపరమైన చర్యలు తీసుకుంటూ వారిని విచారణకు హాజరుకావాలని లేఖలు పంపామని చెప్పారు.

ధైర్యంగా ముందుకు రావాలి..
విదేశాల్లో చిక్కుబడి పోయిన, ఎన్నారైల చేత మోసపోయిన తమ పిల్లల గురించి తల్లిదండ్రులు బాధపడవద్దని, గృహహింస ఎదుర్కోంటున్న వారెవరైనా ఫిర్యాదు చేయవచ్చు. బాధితులు ఎలాంటి భయం లేకుండా ఫిర్యాదు చేసి తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చు అన్న ధైర్యాన్ని తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్ కల్పిస్తోంది.