యాదాద్రిలో మరో అపచారం.. స్వామి రూపం మార్చి సెల్ఫీలు!!

 

తెలంగాణ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో మరో అపచారం చోటు చేసుకుందన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఏకంగా స్వయంభువు విగ్రహంలో మార్పులు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. పెద్ద శిలపై వెలిసిన మూలవిరాట్టు విగ్రహాన్ని.. యాదాద్రి పనులు నిర్వహిస్తున్న ఆర్కిటెక్ట్‌, శిల్పులు.. పెద్దల అనుమతి లేకుండానే.. చెక్కినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. శాంత నరసింహస్వామిని వారు ఉగ్రరూపంగా తయారు చేశారు. ఆయనకు కోరలు పెట్టారు. నాలుక పెద్దదైంది. స్వామి తలపై ఉండే ఆదిశేషుడి ఆకారంలో కూడా మార్పు చేశారు. ఏడు తలల ఆదిశేషుడుని ఐదు తలల ఆదిశేషుడుగా మార్చేశారని తెలుస్తోంది. అంతేకాదు.. అసలు మూల విరాట్టు ఫొటోలు తీయడం, ప్రచురించడమే పాపమన్న సంప్రదాయం ఉండగా.. ఏకంగా స్వయంభువు విగ్రహాన్నే చెక్కడం, శిల్పులు సెల్ఫీలు దిగడం కలకలం సృష్టిస్తోంది.

ఈ వ్యవహారం చినజీయర్‌ స్వామికి తెలిసి ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా కథనాలు వస్తున్నాయి. ఆగమశాస్త్రానికి విరుద్ధంగా జరిగిన ఈ అపచారంపై ఆలయ అర్చకులు, సిబ్బంది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారని తెలుస్తోంది. 15 రోజుల క్రితం.. ఆలయానికి చెందిన కొందరు ఈ విషయాలన్నీ వివరిస్తూ, మూలవిరాట్టుతో శిల్పులు తీసుకున్న సెల్ఫీలను చినజీయర్‌ స్వామికి ఈమెయిల్‌ చేశారని సమాచారం. దీనిపై ఆగ్రహం చెందిన చినజీయర్‌ స్వామి.. వెంటనే ఆలయ ఈవోను తన ఆశ్రమానికి పిలిపించుకుని వివరణ కోరగా.. ఆమె అలాంటిదేమీ జరగలేదని, తాము విగ్రహాన్ని పూర్తిగా చెక్కలేదని, శాండ్‌ బ్లాస్టింగ్‌ మాత్రమే చేశామని ఆమె చినజీయర్‌ స్వామికి వివరించినట్లు తెలుస్తోంది. ఆమె వివరణతో చినజీయర్‌ స్వామి సంతృప్తి చెందలేదని సమాచారం.

యాదాద్రిగా పేర్చు మార్చి, పునర్నిర్మాణం చేస్తున్న యాదగిరిగుట్ట ఆలయంలో జరుగుతున్న పనుల్లో అపచారం చోటుచేసుకోవడం ఇది రెండో సారి. ఆ మధ్య ఆలయ స్థంబాలపై పై సీఎం కేసీఆర్ బొమ్మతో పాటు పార్టీ గుర్తు, పథకాల పేర్లు చెక్కారు. అప్పుడు ఈ ఫోటోలు లీక్ అవ్వడంతో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో అసలు వాటి గురించి ప్రభుత్వానికి తెలియదని, శిల్పులు అత్యుత్సాహానికి పోయి అలా చెక్కారని చెప్పుకొచ్చారు. ఎవరూ చెప్పకుండా శిల్పులు ఎందుకు చెక్కుతారు? ఒకవేళ చెక్కినా.. వాళ్ళు అలా ఆలయంలో ఇష్టానుసారంగా రాజకీయ బొమ్మలు చెక్కుతుంటే.. పర్యవేక్షణ అధికారులు ఏం చేస్తున్నారు అంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇప్పుడు ఏకంగా స్వయంభువు విగ్రహంలో మార్పులు చేసినట్టు ప్రచారం జరుగుతుండటంతో భక్తులు తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాదగిరిగుట్ట ఆలయం పునర్నిర్మాణం చేయాలన్న ఆలోచన మంచిదే కానీ.. ఆచరణలో అపచారాలు చోటు చేసుకోవడంతో ఆగ్రహాలు, విమర్శలు వ్యక్తమవుతున్నాయి.