ఆ పెట్టెలో ఏముంది?

 

ఆ పెట్టెలో ఏముంది? చాలా పెద్దగా వున్న ఆ పురాతన ఇనుప పెట్టెలో ఏముంది? ఆ విషయం శుక్రవారం తెలుస్తుంది? ఇంతకీ ఏమిటా పెట్టె? ఏమాకథ? తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో సరిగ్గా నెల రోజుల క్రితం ఒక పాడుబడిన ఇంటి శిథిలాలను ఆ ఇంటి యజమానులు తొలగిస్తున్నారు. ఈ సందర్భంగా ఇంటి ఆవరణలో ఒక పెద్ద ఇనుప పెట్టె బయటపడింది. పాతరోజుల్లో భోషాణం పెట్టెలనేవి వుండేవి కదా.. అచ్చం ఆ సైజులోనే వున్న ఇనుప భోషాణం పెట్టె అది. దానికి దిట్టంగా తాళం వేసి వుంది. ఆ ఇనుప పెట్టె చుట్టూ అరుంధతి సినిమాలో పెట్టె చుట్టూ వున్నట్టుగా రకరకాల బొమ్మలు కూడా వున్నాయి. దాంతో ఆ పెట్టెని తెరవడానికి ఆ ఇంటి యజమానులు కూడా భయపడిపోయారు. లోపల ఏవో నిధులు వుంటాయని ఆశపడి తెరిస్తే ఏ భూత ప్రేత పిశాచాలో ఆగ్రహిస్తే తమ పరిస్థితి ఏమైపోతుందోనని వారు భయపడ్డారు. ఈ పెట్టె విషయం ఈనోట ఆనోట గవర్నమెంటోళ్ళకి తెలిసిపోయింది. భూమిలో ఏది దొరికినా గవర్నమెంట్ వాలిపోవడం సహజమే కదా. ఈ పెట్టెని స్వాధీనం చేసుకున్న అధికారులు పోలీసుల కస్టడీలో వుంచారు. ఈ పెట్టెని ఏం చేయాలా అని ఆలోచించిన జిల్లా కలెక్టర్ ఈనెల 19వ తేదీన అందరి సమక్షంలో ఈ పెట్టెని తెరవాలని ఆదేశించారు. అందువల్ల ఈ పెట్టెను శుక్రవారం నాడు తెరవనున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంతో తీవ్ర ఉత్కంఠత నెలకొని వుంది. చుట్టుపక్కల ప్రాంతాల జనాలు వేరే పనులేవీ పెట్టుకోకుండా పెట్టె తెరిచే కార్యక్రమాన్ని చూడాలని ఆసక్తిగా వున్నారు. ఇదిలా వుంటే ఈ పెట్టెలో బోలెడంత బంగారం, వజ్రాలు వుంటాయని కొంతమంది ఊహాగానాలు పాడేస్తున్నారు. వారి ఊహ నిజమవుతుందా.. తుస్సుమంటుందా అనేది తెలియాలంటే రేపటి వరకూ ఆగాల్సిందే.