యన్టీఆర్ విగ్రహావిష్కరణతో మొదలయిన కొత్త చర్చలు

 

గత 17 సం.లుగా స్వర్గీయ యన్టీఆర్ విగ్రహం పార్లమెంటు ఆవరణలో ప్రతిష్టించాలని పురందేశ్వరి, తెలుగుదేశం పార్టీతో పట్లుబడుతున్నపుడు, అన్ని రాజకీయ పార్టీ నేతలు వారి గొడవను ముచ్చటగా చూస్తుండిపోయారు. చివరికి ఆమె నిన్న పార్లమెంటు ఆవరణలో యన్టీఆర్ విగ్రహం ఆవిష్కరింపజేసిన తరువాత గానీ వారికి జ్ఞానోదయం కాలేదు.

 

సీనియర్ కాంగ్రెస్ నేత మరియు రాజ్యసభ సభ్యుడు వీ. హనుమంతరావు స్పీకర్ మీరా కుమార్ ను కలిసి పార్లమెంట్‌లో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ దామోదరం సంజీవయ్య విగ్రహాన్ని ప్రతిష్టించాలని కోరితే, తెరాస నేత హరీష్ రావు మాజీప్రధాని స్వర్గీయ పీవీ నరసింహరావు విగ్రహం పెట్టాలని కోరారు. ఇక అదేవిధంగా మరో తెరాస నేత రాష్ట్ర శాసనసభ ఆవరణలో తెరాస సిద్ధంత కర్త స్వర్గీయ జయశంకర్ విగ్రహం ఏర్పాటు చేయాలనీ కోరగా, దళిత వర్గాలకి చెందిన నేతలు జ్యోతీరావు పూలే విగ్రహాన్ని ప్రతిష్టించాలని డిమాండ్ చేస్తున్నారు.

 

ఈ విగ్రహాల డిమాండ్స్ పక్కన బెడితే, కాంగ్రెస్ పార్టీని వ్యతిరేఖిస్తూ పార్టీని స్థాపించి, రాష్ట్రంలో పార్టీని ఓడించిన స్వర్గీయ యన్టీఆర్ ని, పురందేశ్వరి మాటలు విని కాంగ్రెస్ పార్టీ నెత్తిన పెట్టుకోవడం ఏమిటని అనంతపురం లోక్ సభ సభ్యుడు అనంత వెంకట్రామిరెడ్డి వంటి వారు కొందరు విమర్శిస్తుంటే, మరో పక్క సోనియాగాంధీ ఈ ఆవిష్కరణ సభకు హాజరు కాకుండా తెలుగుజాతిని అవమానించారని తెదేపా నేతలు నిప్పులు కక్కుతున్నారు. దేశానికి, కాంగ్రెస్ పార్టీకి చిరకాలం సేవలందించిన మాజీప్రధాని స్వర్గీయ పీవీ.నరసింహరావు చనిపోయినప్పుడు కనీసం కడసారి చూసేందుకు కూడా వెళ్ళని సోనియా గాంధీ, మళ్ళీ ఇప్పుడు తెలుగు గడ్డకి చెందిన స్వర్గీయ యన్టీఆర్ విగ్రహావిష్కరణకి కూడా మొహం చాటేసి యావత్ తెలుగు ప్రజలను అవమానించారని విమర్శించారు.

 

చంద్రబాబు తదితరులు కూడా విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ప్రభుత్వం తూ...తూ...మంత్రంగా జరిపి చేతులు దులుపుకొందని, ఆ మహానుభావుడి గురించి కనీసం ఎవరికీ ఒక్క ముక్క మాట్లాడే అవకాశం ఈయకుండా కేవలం పదినిమిషాలలో కార్యక్రమం ముగించడం పట్ల అసంతృప్తి వెలిబుచ్చారు. మొత్తం మీద యన్టీఆర్ విగ్రహావిష్కరణ ఆలోచన మొదలు పెట్టిననాటి నుండి అది ముగిసిన తరువాత కూడా ఇంకా చర్చలు ఏదో ఒక రూపంలో కొనసాగుతోనే ఉన్నాయి.