'రామ జన్మభూమి ట్రస్ట్' చైర్మన్ గా 'నృత్య గోపాల్ దాస్'

అయోధ్య రాముడి ఆలయ నిర్మాణం దిశగా అడుగులు చకచకా పడుతున్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలోని సీనియర్ న్యాయవాది పరాశరన్ నివాసంలో అయోధ్య రామజన్మ భూమి ఆలయ నిర్మాణ ట్రస్ట్ తొలిసారి సమావేశమైంది. ఈ సమావేశంలో ట్రస్టు సభ్యులు కొత్త అధ్యక్షుడిగా మహంత నృత్య గోపాల్ దాస్ ను ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా చంపత్ రాయ్, కోశాధికారిగా గోవింద్ గిరి నియమితులయ్యారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటైన నిర్మాణ సమితికి ప్రధాని నరేంద్ర మోడీ, మాజీ ప్రధాన కార్యదర్శి ఐఏఎస్ అధికారి నృపేంద్ర మిశ్రా నేతృత్వం వహించనున్నారు. ప్రజల విశ్వాసానికి అనుగుణంగా రామాలయ నిర్మాణం త్వరలోనే ప్రారంభమవుతోందన్నారు ట్రస్ట్ అధ్యక్షుడు నృత్య గోపాల్ దాస్. అదేవిధంగా ఆలయ నిర్మాణానికి సంబంధించిన మోడల్ లో టెంపుల్ ఎత్తు వెడల్పులో పెరుగుదల ఉంటుందంటున్నారు. 

ఆలయ నిర్మాణంలో విరాళాల కోసం అయోధ్యలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా ప్రారంభించటానికి సమావేశంలో నిర్ణయం తీసుకుంది ట్రస్ట్. రామమందిర నిర్మాణ పనులు ఏప్రిల్ లో ప్రారంభం కానున్నట్టు తెలుస్తుంది. ఏప్రిల్ రెండువ తేదీ శ్రీరామ నవమి రోజున కానీ.. ఏప్రిల్ 26వ తేదీ అక్షయ తృతీయ రోజున గానీ ఆలయ నిర్మాణ పనులు ప్రారంభించే అవకాశముందని అన్నారు ట్రస్టు సభ్యులు. ఆలయ నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తి చేసే యోచనలో ఉంది ట్రస్ట్. కాగా 15రోజుల తర్వాత అయోధ్యలో మరోసారి సమావేశం కానున్న ట్రస్టు సభ్యులు.. ఆలయ నిర్మాణ ప్రారంభోత్సవానికి సంబంధించి తేదీని ప్రకటించే అవకాశముంది. అలాగే.. సమావేశంలో కేంద్రం తరపున హోంమంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి జ్ఞానేశ్ కుమార్, యూపీ ప్రభుత్వం తరపున అవినాష్ మహంతి అయోధ్య జిల్లా మేజిస్ట్రేట్ అనూజ్ కుమార్ జా పాల్గొన్నారు.