డిసెంబరు 30 వరకు ఏటీఎం ఛార్జీలు రద్దు...

 

పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు ఏటీఎంల వద్ద బారులు తీరుతున్న సంగతి తెలిసిందే. అయితే వారికి కొంత ఊరటనిచ్చే నేపథ్యంలో ఆర్బీఐ ఓ నిర్ణయం తీసుకుంది. అదేంటంటే.. ఏటీఎంల ద్వారా జరిపే అన్ని లావాదేవీలపై డిసెంబరు 30వ తేదీ వరకు ఛార్జీలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇది సేవింగ్స్‌ బ్యాంకు ఖాతాదార్లకు వర్తిస్తుంది. ‘తమ బ్యాంకుల ఏటీఎంలతో పాటు ఇతర బ్యాంకుల ఏటీఎంలలో నెలలో ఎన్నిసార్లు లావాదేవీలు (ఆర్థిక, ఆర్థికేతర) జరిపినా ఎటువంటి ఛార్జీలు వసూలు చేయబోమ’ని ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా ప్రస్తుతం సొంత బ్యాంకు ఏటీఎంల నుంచి నెలకు అయిదు సార్లు, ఆరు మెట్రో నగరాల్లో ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి నెలకు మూడు సార్లు మాత్రమే ఉచితంగా లావాదేవీలు జరిపే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే.