మీటింగ్ లో మతలబేంటి? మీడియా ఓవరాక్షన్..

ఇదిగో తోక అంటే ..అదిగో పులి అంటారు, ఇది ఒక విధంగా మానవ నైజం. ముఖ్యంగా రాజకీయాలలో, రాజకీయ నాయకులలో ఇలాంటి నైజం కొంచెం ఎక్కువగా ఉంటుంది. మరో వంక మీడియా ఎక్కడ, ఎవరితో కలిసారు.. ఎందుకు కలిసారు.. ఏమి మాట్లాడుకున్నారు అని దుర్భిణి వేసి మరీ వెతుకుతుంటుంది. 


ఇద్దరు వేర్వేరు పార్టీలకు చెందిన రాజకీయ ప్రముఖులో, లేదా రాజ్యాంగ ఉన్నత పదవుల్లో ఉన్నవారో ఎక్కడో కలిస్తే.. ఇక అక్కడి నుంచి కధలు, కహానీలు మొదలవుతాయి. మీడియా ట్రయిల్ స్టార్ట్ అవుతుంది. అలాగే ఇటు మీడియా అటు సోషల్ మీడియా కోడి గుడ్డు మీద ఈకలు పీకడం మొదలుతుంది.


ఇప్పుడు మీడియాకంటే  సోషల్ మీడియాడి పై చేయి అయిన నేపధ్యంలో ‘ఇదిగో తోక అంటే అదిగో పులి’ కథలు మరీ ఎక్కువయ్యాయి. అది చాలదు అన్నట్లుగా, నిప్పు లేనిదే పొగ రాదనే సమర్ధింపులు. ఇంకో అడుగు ముదుకేసి, మీడియాలోనో,  సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న, డబుల్ మర్డర్ కథనో కాదంటే పత్రికలలో పతాక శీర్షికలలో వచ్చిన అవినీతి భాగోతాన్నో జోడించి, ఆ ఇద్దరు ఎందుకు కలిసారు? అందుకేనా? అంటూ తలా తోకా లేని.. సెన్సేషన్ హెడ్డింగ్స్ తో రేటింగ్స్  పెంచుకునే కహానీలు ప్రసారంచేయడం మీడియాకు అలవాటుగా మారింది. ఇందుకు సంబంధించి న్యాయస్థానాలు హెచ్చరికలు చేసినా, ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నా.. మీడియాలో, మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో మార్పు రావడంలేదు. 


అందుకే కావచ్చు ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, రాష్ట్ర హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీతో సమావేశమైన చిన్ని క్లిప్పింగ్, సోషల్ మీడియాలో షికార్లు చేస్తోంది. రెండు రాజ్యాంగ వ్యవస్థల మధ్య అనేక విషయాల్లో పరస్పర అవగాహనా, సహకారం, ఇచ్చి పుచ్చుకోవడాలు వంటివి సవాలక్ష ఉంటాయి. అలాగే.. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు ఒకరినొకరు కలుసుకోవడం సాధారణ విషయం. నిజానికి అది మంచి సంప్రదాయం. గతంలో ఏమో గానే ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే రాష్ట్ర గవర్నర్, ప్రధాన న్యాయమూర్తులను కలసి పరిపాలన సంబంధ విషయాలను చర్చిండం, వారి సలహాలు తీసుకోవడం ఒక ఆచారంగ పాటిస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తిని కలవడం కూడా అలాంటి సత్సంప్రదాయంలో భాగమే కావచ్చును. అంతే కానీ, ఇంకేదో ఉహించుకుని ఇదిగో తోక అదిగో పులి కథనాలకు పోతే.. అది మీడియాకు.. సమాజానికి కూడా మంచిది కాదు. కాబట్టి ఇప్పటికైనా అదిగో పులి కథనాలకు స్వస్తి చెప్పడం మంచింది. కాదంటే కోరి కష్టాలు తెచ్చుకోవడమే అవుతుంది.