తెలంగాణాలో నేటి నుంచి నామినేషన్లు

 

 

 

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల సందడి మొదలైంది. తెలంగాణాలో తొలివిడత అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు ఈ రోజు నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నేపథ్యంలో నామినేషన్ల దాఖలు లో తీసుకోవాల్సిన ప్రత్యేక జాగ్రత్తలను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ వెల్లడించారు. స్థానికంగా ఉన్న ఆస్తులతోపాటు విదేశాల్లోని ఆస్తులు, అప్పుల వివరాలను, పోలీసు కేసులుంటే ఆ వివరాలూ అఫిడవిట్‌లో పొందుపరచాలి. ఏ ఒక్క సమాచారం లేకపోయినా నామినేషన్లను తిరస్కరిస్తామని చెప్పారు. నామినేషన్ జారీ తేదీ నుంచి ఈ నెల తొమ్మిదో తేదీ వరకు ఉదయం 11 గంటల నుంచి మూడు గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామని, పదో తేదీన పరిశీలించి, 12న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇస్తామని, అదే రోజు గుర్తులు కేటాయిస్తామని చెప్పారు.

 

అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయనున్న నియోజకవర్గం పరిధిలోని పది మంది ఓటర్లు ఆయన పేరును ప్రతిపాదించాలి. గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థి అయితే ఒక్కరు చాలు. పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థి రూ. 25వేలను డిపాజిట్టుగా చెల్లించాలి. శాసనసభకు పోటీచేసే అభ్యర్థి రూ.10 వేలను డిపాజిట్లుగా చెల్లించాలి.ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అందులో సగం చెల్లించాలి.పార్లమెంటు అభ్యర్థి రూ. 70లక్షల వరకు ప్రచారానికి ఖర్చు చేయవచ్చు. అసెంబ్లీ అభ్యర్థి రూ. 28 లక్షల వరకు ఖర్చు చేయవచ్చు.