తెలంగాణలో నామినేషన్ల సందడి... ఇంకా రెండ్రోజులే గడువు...

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. నోటిఫికేషన్ విడుదలైన 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో పెద్దఎత్తున నామినేషన్లు దాఖలు అవుతున్నాయి. ఇవాళ్టి నుంచి జనవరి 10వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఇక, జనవరి 22న పోలింగ్ నిర్వహించి.... 25న ఫలితాలను ప్రకటించనున్నారు. అయితే, తిరస్కరించిన నామినేషన్లపై అప్పీల్‌కు జనవరి 12, 13 వరకు గడువు ఇచ్చారు. అలాగే, నామినేషన్ల ఉపసంహరణకు జనవరి 14ని తుది గడువుగా ప్రకటించారు. జనవరి 22న ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ నిర్వహించి.... జనవరి 25న ఫలితాలను ప్రకటించనున్నారు. మున్సిపల్‌ చట్టం-2019 ప్రకారం ఎన్నికలు నిర్వహించనున్నారు. అయితే, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో తప్పుల కారణంగా హైకోర్టు స్టే ఇవ్వడంతో కరీంనగర్‌లో ఎన్నికను వాయిదా వేసినట్లు తెలంగాణ ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు.