లైంగిక హింసపై పోరాటం.. నోబెల్ పురస్కారం

 

ప్రపంచ ప్రఖ్యాత పురస్కారం నోబెల్ శాంతి బహుమతి ఇద్దరిని వరించింది. లైంగిక అత్యాచారాలపై తిరుగు బావుటా ఎగురవేసినందుకు గానూ వారికి ఈ అవార్డు లభించింది. డెనిస్‌ ముక్‌వెగె, నదియా మురద్‌లకు సంయుక్తంగా ఈ బహుమతి దక్కింది. డెనిస్‌ మక్‌వెగె కాంగోకు చెందిన గైనకాలజిస్టు‌. ఆయన లైంగిక హింస బాధితులకు సహాయం చేశారు. అంతే కాకుండా వారికి చేదోడువాదుడుగా ఉంటూ వారికి మానసికంగా ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు. ఇక నదియా మురద్‌ విషయానికి వస్తే.. ఆవిడ ఇరాక్‌కు చెందిన మానవ హక్కుల కార్యకర్త. నదియా ఇరాక్‌లో యాజిదీలు ఎక్కువగా నివసించే సింజర్‌ ప్రాంతలో ఉండేది. ఇది సిరియా సరిహద్దుకు దగ్గరగా ఉంటుంది. అక్కడ ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదుల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. వారి చేసే అకృత్యాలు దారుణంగా ఉంటాయి. ముఖ్యంగా యాజిదీ స్త్రీల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తారు. నదియాను కూడా ఉగ్రవాదులు అపహరించారు. కొన్ని నెలల పాటు బంధించి ఆమెపై ఉగ్రవాదులు సామూహికంగా అత్యాచారాలకు పాల్పడ్డారు. విపరీతంగా కొట్టి హింసించారు. తనలా నరకం అనుభవిస్తున్న యాజిదీ యువతులను రక్షించడమే లక్ష్యంగా పెట్టుకున్న నదియా అందుకోసం ఎంతో కృషి చేసింది. యుద్ధంలో మహిళలపై లైంగిక హింసను ఆయుధంగా వాడుకోవడాన్ని నిర్మూలించేందుకు చేసిన కృషికి గాను కాంగోకు చెందిన డెనిస్‌ ముక్‌వెగె, నదియా మురద్‌లకు ఈ ఏడాది నోబెల్‌ శాంతి పురస్కారం లభించింది.