ప్రత్యేక హోదా ఏపీ హక్కు.. మరిచిపోయారా జగన్ గారు

 

 

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రాక ముందు ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై తీవ్రంగా పోరాడింది. ప్రత్యేక హోదా ఏపీ హక్కు అనే నినాదంతో కదం తొక్కింది. దీంతో ప్రత్యేక హోదా అనేది ఏపీ ప్రజలకు సెంటిమెంటు అంశంగా మారింది. ఇదే అంశాన్ని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అస్త్రంగా మలుచుకుని ఉద్యమించటం జరిగింది. ఈ క్రమంలో జరిగిన 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ అఖండ మెజారిటీతో విజయం సాధించి అధికారం చేజిక్కించుకుంది. అయితే ఏపీకి ప్రత్యేక హోదాపై ఆ పార్టీ పట్టు సడలించడంతో ఆ అంశం కాస్త మరుగున పడిందనే భావన వ్యక్తమవుతోంది. నిజానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఏపికి ఇచ్చిన ప్రధాన హామీలలో ప్రత్యేక హోదా ఒకటి. అలాగే రాష్ర్టానికి పలు హామీలిచ్చిన వాలాలో ఇంకా చాలా నెరవేరలేదు. కేవలం కొన్ని మాత్రమే అమలు కావడం మరీ ముఖ్యంగా ప్రత్యేక హోదా హామీని విస్మరిస్తుండడం పై విశాఖలో పలు ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు మండిపడుతున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన టిడిపి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీలు ఇది వరకే తమ వైఖరిని కూడా ప్రకటించాయి. మరీ ముఖ్యంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ర్టానికి ప్రత్యేక హోదా ఇవ్వడంతో పాటు విభజన హామీలన్నీ త్వరితగతిన అమలు చేయాలని తీవ్రంగా పోరాడింది. ఈ అంశంలో ఆ పార్టీ నేతలు పాదయాత్రలు చేసి ప్రజల్లోకి చొచ్చుకెళ్లారు. తీరా అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదా అంశంపై వరసలు మాట్లాడ్డం లేదని విశాఖలోని పలు ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు బాహాటంగానే విమర్శిస్తున్నారు.

ఈ విషయంలో అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి వైఖరిని తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఢిల్లీకి వెళ్లినప్పుడు ఏదో మొక్కుబడిగా ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేయాలని కేంద్రానికి లేఖలు ఇవ్వడం తప్ప జగన్ చేసిందేమి లేదని వారు మండిపడుతున్నారు. నిధుల లేమితో ఇబ్బందులు పడుతున్న రాష్ర్టానికి ప్రత్యేక హోదా వస్తే ఎన్నో ప్రయోజనాలు వస్తాయని అంటున్నారు. ఈ విషయంలో అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు మౌనం వహిస్తోందని ప్రశ్నిస్తున్నారు. ఏపీకి సెంటిమెంట్ గా మారిన ప్రత్యేక హోదా అంశంపై నాడు గట్టిగా గళమెత్తిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సైలెంట్ గా మారడంపై పలు రకాలుగా చర్చ జరుగుతోంది. జగన్మోహనరెడ్డి తనపైన కేసులకు భయపడి ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి చేయడం లేదని అందుకే ఆ అంశాన్ని విస్మరిస్తున్నారని విశాఖలోని ప్రజా సంఘాలు, పలు రాజకీయ పార్టీల నేతలు అనుకుంటున్నారు. ఈ అంశాన్ని అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటకెక్కించిందనే భావనకు వారు వచ్చారు. తమతో కలిసొచ్చే వారితో కలిసి ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై మళ్లీ పోరు బాట పట్టాలని వారు నిర్ణయించారు.

ఇది ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు సంబంధించిన అంశం కాబట్టి దీనిపై అందరూ ఐక్యంగా పోరాడితేనే రాష్ర్టానికి ప్రయోజనం ఉంటుందని వారంటున్నారు. కాగా ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై పోరాడటానికి కొన్ని రాజకీయ పార్టీలు సిద్ధంగా ఉండగా మరికొన్ని వెనకడుగు వేస్తున్నాయి. ప్రత్యేక హోదా సాధన సాధ్యం కాదని ఆ పేరు లేక పోయినా అన్ని ప్రయోజనాలూ ఇస్తున్నామని కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఇది వరకే ప్రకటించారు. ఈ క్రమంలో రాష్ట్రం లోని ఆ పార్టీ నేతలు ప్రత్యేక హోదా కోసం పోరాటానికి కలిసి వస్తారని అనుకోవడం అత్యాశే అవుతుందని అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. ఇక జగన్ మోహన్ రెడ్డి ప్రతి పక్ష నాయకుడిగా ఉన్నప్పుడు తన పాద యాత్ర బహిరంగ సభల్లోనూ ఏపీకి ప్రత్యేక హోదా అవసరమని తాము అధికారం కొస్తే స్పెషల్ స్టేటస్ పోరాడి సాధిస్తామని ఎంతో ఆర్భాటంగా చెప్పారు. తీరా ఇప్పుడు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కూడా మౌనంగా ఉండడం చర్చనీయాంశంగా మారింది.

ఇక మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ ఏపీకి ప్రత్యేక హోదా అంశానికి పూర్తి మద్దతు పలికింది. టిడిపి జనసేన పార్టీలు కూడా హోదాపై తమ వైఖరిని స్పష్టం చేశాయి. కమ్యూనిస్టులతో పాటు ఇతర పార్టీలు కూడా ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు కావాలని బలంగా కోరుకుంటున్నాయి. ఇలా ఎవరికి వారు పోరాడితే ఫలితం ఉండదని అందరూ ఒక్క జేఏసీగా ఏర్పడి ఉద్యమిస్తేనే ప్రయోజనం ఉంటుందని మేధావులు అంటున్నారు. అందుకు అనుగుణంగా చర్చలు కూడా జరుపుతున్నారు. ఈ చర్చలు కనుక ఫలప్రదమైతే ఎపికి ప్రత్యేక హోదా సాధనకు ఒక ఫ్లాట్ ఫామ్ ఏర్పడుతుందనీ అంటున్నారు. మరి ఆ చర్చలు ఎంత వరకు ఫలిస్తాయో చూడాలి.