చంద్రబాబు రోడ్‌షోకు అనుమతి లేదు

 

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో ప్రజకూటమి తరుపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. నిన్న ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తో వేదికను పంచుకున్న చంద్రబాబు పలు చోట్ల నిర్వహించిన సభల్లో పాల్గొని టీటీడీపీ శ్రేణుల్లో ఉత్సహాన్ని నింపారు. కాగా నేడు కూకట్ పల్లి నియోజకవర్గంలో చంద్రబాబు తలపెట్టిన రోడ్ షోకు సైబరాబద్ పోలీసులు అనుమతి నిరాకరించారు. శేరిలింగంపల్లి, కూకట్ పల్లి నియోజకవర్గంలోఉదయం నుంచి రాత్రి వరకు చంద్రబాబు పర్యటనలకు అనుమతి కోరుతూ ఈ నెల 27న దరఖాస్తు చేశారు. ఇప్పటికే మంత్రి కేటీఆర్‌ రోడ్‌ షోకు అనుమతి ఇచ్చామని,ఆయన ఈనెల 26నే అనుమతి తీసుకున్నారని కూకట్‌పల్లి పోలీసులు తెలిపారు. ఒకే రోజు మరో పార్టీకి అనుమతి ఇవ్వలేని తెలిపారు. కూకట్‌పల్లిలో టీడీపీ తరుపున మహాకూటమి అభ్యర్థిగా హరికృష్ణ కూతురు నందమూరి సుహాసిని బరిలో ఉన్న సంగతి తెలిసిందే. కోడలికి మద్దతుగా నేడు చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించాలని భావించారు. ఈ నేపథ్యంలో పోలీసులు రోడ్‌షోకు అనుమతి నిరాకరించడం గమనార్హం. కాగా చంద్రబాబు శేరిలింగంపల్లి నియోజకవర్గంలో టీడీపీ తరుపున మహాకూటమి అభ్యర్థిగా బరిలో ఉన్న సినీ నిర్మాత, వ్యాపారవేత్త భవ్య ఆనంద్ ప్రసాద్ కి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.