తాళిబొట్టు తీసేయాలా?..గవర్నర్‌ ఆగ్రహం

 

ఆదివారం మెదక్ జిల్లా నర్సాపూర్‌లో వీఆర్వో పరీక్ష కేంద్రం వద్ద అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు.. మహిళలను దారుణంగా అవమానించారు.. వివాహితలు తాళిబొట్టు, మెట్టెలు తీస్తేనే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామని ఆంక్షలు విధించారు.. దీంతో చేసేదేమీ లేక మహిళలు తాళిబొట్టు, మెట్టెలు తీసి పరీక్ష రాసేందుకు వెళ్లారు.. ఇది మహిళలను అవమానించేలా ఉందంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. మరోవైపు ఈ విషయంపై గవర్నర్‌ నరసింహన్‌ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.. ఈ ఘటనకు బాధ్యులు ఎవరని ప్రశ్నిస్తూనే వివరణ ఇవ్వాలని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ను ఆదేశించినట్టు సమాచారం.. దీంతో టీఎస్పీఎస్సీ ఒక నివేదికను రాజభవన్‌కు పంపినట్టు తెలుస్తోంది.. ఈ ఘటనకు అయా పరీక్షా కేంద్రాల నిర్వాహకులే బాధ్యులవుతారని నివేదికలో పేర్కొనట్టు తెలిసింది.. ఈ వివాదంపై టీఎస్పీఎస్సీ సెక్రటరీ ఎ.వాణీప్రసాద్‌ వివరణ ఇచ్చారు.. మహిళా అభ్యర్థులు మంగళసూత్రాలు తీసి రావాలనే నిబంధనను తాము విధించలేదని తెలిపారు.. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లోని ఓ పరీక్షా కేంద్రంలో మంగళసూత్రాలు తీసి రావాలని సిబ్బంది ఆదేశించినట్లు వార్తలు రాగానే స్పందించామని చెప్పారు.. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ను ఆదేశించినట్లు తెలిపారు.. ఆ పరీక్షా కేంద్రాన్ని బ్లాక్‌ లిస్టులో పెట్టాలని ఆదేశించామన్నారు.