సీఎం జగన్ కోసమే వైవీ ఏకపక్ష నిర్ణయం.. శ్రీవారి భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ఎవరూ ఎలాంటి డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని టీటీడీ చైర్మెన్  వైవీ సుబ్బారెడ్డి చేసిన ప్రకటన దుమారం రేగుతోంది. టీటీడీ చైర్మెన్ నిర్ణయంపై శ్రీవారి భక్తులు, హిందూ ధార్మిక సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. సీఎం జగన్ కోసమే ఆయన బాబాయ్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 23న సీఎం హోదాలో స్వామివారి గరుడ సేవ లో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు జగన్మోహన్ రెడ్డి. గత ఏడాది కూడా శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అయితే ఆలయంలో డిక్లరేషన్ ఇవ్వలేదు. సీఎం జగన్ తీరుపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. హిందూ సంఘాలు ఆందోళన కూడా చేశాయి. పలు ధార్మిక సంఘాలు ఈ విషయమై టీటీడీని   ప్రశ్నించాయి. దీంతో వారికి సరైన సమాధానం చెప్పుకోలేకపోయింది టీటీడీ బోర్డు. ఈసారి కూడా సీఎం జగన్  శ్రీవారి  గరుడ సేవకు వస్తుండటంతో మళ్లీ డిక్లరేషన్ అంశం తెరపైకి వచ్చింది. దీంతో జగన్ కు ఇబ్బంది రాకుండా ఆయన బాబాయ్ అయిన చైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి ఎక్కడా సంతకం పెట్టాల్సిన అవసరం లేదనే నిర్ణయం ప్రకటించారనే ఆరోపణలు వస్తున్నాయి.  
                         

తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్యమతస్థులుగా కనిపించిన వారి దగ్గర నుండి కచ్చితంగా డిక్లరేషన్ తీసుకుంటున్నారు. ఈ నిబంధన ఎప్పటి నుండో వస్తుంది. ఇతర మతస్థులు శ్రీవారిని దర్శించుకోడానికి వచ్చినప్పుడు డిక్లరేషన్ ఇస్తారు. అయితే టీటీడీ విషయంలో సీఎం జగన్ తీరుపై మొదటి నుంచి విమర్శలు ఉన్నాయి. వైఎస్ కుటుంబమంతా క్రిస్టియన్ మతాచారాలను ఆచరిస్తున్నారు. చర్చీలకు వెళ్లి ప్రార్ధనలు చేస్తారు. జగన్ ఇంట్లోనే మత బోధకులు ఉంటారని, ఆయన కుటుంబంలో ఏ కార్యక్రమమైనా క్రైస్తవ పద్ధతిలోనే జరుగుతుందని రాష్ట్రమంతా తెలుసు. వైఎస్ కుటుంబ సభ్యులే వీటిని అంగీకరించారు. సో.. టీటీడీ నిబంధనల ప్రకారం వైఎస్ జగన్ శ్రీవారి ఆలయానికి వెళితే డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. కాని జగన్ మాత్రం దీన్ని ఆచరించడం లేదు. ప్రతిపక్ష నేతగా గతంలో టీటీడీ ఆలయానికి వెళ్లినప్పుడు కూడా డిక్లరేషన్ ఇవ్వలేదు. 

 

ఈసారి కూడా సీఎం జగన్ అలానే చేయవచ్చు. కాని టీటీడీ మాత్రం శ్రీవారి అలయానికి ఎవరూ వచ్చినా అభ్యంతరం లేదని, డిక్లరేషన్ అవసరం లేదని ప్రకటించింది. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయమే ఇప్పుడు వివాదమవుతోంది. కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి భంగం కలిగించేలా టీటీడీ వ్యవహరించిందనే ఆరోపణలు వస్తున్నాయి. టీటీడీలో ఎప్పటి నుంచో వస్తున్న గొప్ప అచారాన్ని తొలగించడమేంటని శ్రీవారి భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక వ్యక్తికి ఇబ్బంది కలగకుండా చూడటం కోసం కోట్లాది మంది భక్తుల విశ్వాసాలకు భంగం కలిగించారని విమర్శిస్తున్నారు. అత్యంత  కీలకమైన, భక్తుల విశ్వాసాలకు సంబంధించిన డిక్లరేషన్ అంశంపై.. టీటీడీ పాలకమండలి సమావేశంలో చర్చించారా లేక చైర్మెన్ ఒక్కరే నిర్ణయం తీసుకున్నారా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. 
                        

క్రిస్టియన్ గా ఉన్న సీఎం జగన్ డిక్లరేషన్ ఇచ్చాకే శ్రీవారిని దర్శించుకోవాలని హిందూ సంఘాలు కోరుతున్నాయి. టీటీడీ రూల్స్ పాటించాల్సిందేనని, లేదంటే ఆలయానికి రాకుండా ఉండాలని సూచిస్తున్నాయి. బ్రహ్మోత్సవాల్లో శ్రీవారికి ముఖ్యమంత్రే పట్టు వస్త్రాలు ఇవ్వాలన్న రూలేమి లేదని.. మంత్రులు, అధికారులు కూడా ఇవ్వొచ్చంటున్నారు భక్తులు. గతంలో బ్రోహ్మత్సవాల్లో మంత్రులు పట్టు వస్త్రాలు సమర్పించిన సందర్భాలున్నాయని గుర్తు చేస్తున్నారు. ఇతర మతస్తులు శ్రీవారి ఆలయానికి వస్తే డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఎప్పటి నుంచో వస్తున్న ఈ ఆచారాన్ని తప్పకుండా పాటించి తీరాలని స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే తిరుమలలో అన్య మత ప్రచారం జరుగుతుందని.. టీటీడీ తీసుకుంటున్న ఇలాంటి చర్యలతో ఇది మరింతగా పెరిగే అవకాశం ఉందని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. 

 

భారత రాష్ట్రపతి హోదాలో తిరుమలకు వచ్చిన అబ్దుల్ కలాం డిక్లరేషన్ ఇచ్చాకే శ్రీవారిని దర్శించుకున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు యూపీఏ చైర్ పర్సన్ గా, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళగా గుర్తింపు పొందిన సోనియా గాంధీ కూడా టీటీడీ రూల్స్ పాటించారు. డిక్లరేషన్ ఇచ్చాకే ఆమె ఆలయంలో ఎంట్రీ ఇచ్చారు. దేశంలోని పలువురు ఇతర మతాల ప్రముఖులు కూడా తిరుమల వచ్చినప్పడు.. డిక్లరేషన్ ఇచ్చారు. అబ్దుల్ కలాం, సోనియా గాంధీ వంటి ప్రముఖులే తిరుమలకు వచ్చినప్పుడు డిక్లరేషన్ తీసుకున్న సందర్భాలున్నాయని.. జగన్ కు వచ్చిన ఇబ్బంది ఏంటనే ప్రశ్న శ్రీవారి భక్తుల నుంచి వస్తోంది. 

 

ఇక టీటీడీ బోర్డు నిర్ణయాలపై విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి స్పందించకపోవడాన్ని శ్రీవారి భక్తులు, హిందూ ధార్మిక సంఘాలు తప్పుబడుతున్నాయి. హిందూ మత రక్షకుడిగా చెప్పుకునే స్వరూపానందేంద్ర స్వామి .. అన్యమతస్తులకు సంబంధించిన డిక్లరేషన్ విషయంలో ఎందుకు మాట్లాడటం లేదని భక్తులు ప్రశ్నిస్తున్నారు. టీటీడీ చైర్మెన్ నిర్ణయాన్ని ఆయన అంగీకరిస్తున్నారా అని ప్రశ్నిస్తున్నారు. అంతర్వేది రథం దగ్ధం, బెజవాడ దుర్గమ గుడిలో వెండి సింహాలు మాయమైనా స్వామి స్పందించలేదని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్రంలో ఆలయాలపై దాడులు జరుగుతున్నా, దేవతా విగ్రహాలను ధ్వంసం చేస్తున్నా పట్టించుకోరా అని నిలదీస్తున్నారు. గతంలో ఆలయంలో ఏ చిన్న ఘటన జరిగినా ఏదో జరిగిపోయినట్లు హడావుడి చేసిన స్వరూపానందేంద్ర స్వామి.. ఇంత పెద్ద ఘటనలు జరుగుతున్నా, భక్తుల విశ్వాసాలకు భంగం కలిగే చర్యలను ప్రభుత్వాలు తీసుకుంటున్నా కనిపించడం లేదా అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. స్వామిజీలు రాజకీయాలు చేయకుండా హిందూ ధర్మ రక్షణకు పాటుపడాలని కోరుతున్నారు.