అవిశ్వాస రాజకీయాలు

 

రాష్ట్ర రాజకీయాలలో ఇప్పుడు అంతటా అవిశ్వాసం నెలకొంది. ఎవరు కాంగ్రెస్ పార్టీకి తొత్తులో, ఎవరు ప్రజలకు ఒరగబెట్టేవారో, ఎవరు అధికారం కోసం ప్రాకులాడుతున్నారో తెలియనంతగా మన రాష్ట్ర రాజకీయాలు నడుస్తున్నాయి. ఇక మన రాజకీయ పార్టీలు కలిసి కట్టుగా పనిచేస్తున్నాయో లేక ఒకదానితో మరొకటి విభేదిస్తూ పనిచేస్తున్నాయో కూడా ప్రజలకి అర్ధం కాని పరిస్థితి.

 

తెలంగాణా ఇస్తే కాంగ్రెస్ పార్టీలో కలిసిపోతామంటున్న తెరాసా అదే కాంగ్రెస్ పార్టీ మీద తనకు నమ్మకం లేదని అవిశ్వాసం పెడుతుంది.

 

నా కొడుకును సోనియా గాంధీయే జైల్లో తోయించి సీబీఐ మరియు యెన్ఫోర్స్ మెంటు వారిని అడ్డం పెట్టుకొని నానా బాధలు పెడుతోంది, అని వాపోతున్న విజయమ్మ అదే నోటితో అదే సమయంలో అవసరమయితే 2014 సం. ఎన్నికల తరువాత సోనియమ్మ నడిపిస్తున్న కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామని అంటారు. కేంద్రంలో మద్దతు ఇస్తామంటే దాని అర్ధం రాష్ట్రంలో అవిశ్వాసం పెట్టమని కాదు అంటూ మళ్ళీ ఆ మరునాడే రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాసం కూడా పెడతారు.

 

తెరాసతో కలిసి రాష్ట్ర ప్రభుత్వానికి సమాధి కట్టేస్తామని మంగమ్మ శపదాలు చేసిన విజయమ్మ, మీ అవిశ్వాసం మీది, మా అవిశ్వాసం మాదే అంటారు. అవిశ్వాసం+అవిశ్వాసం=విశ్వాసం అనే కొత్త సూత్రంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై రెండు అవిశ్వాసాలు పెట్టి ప్రభుత్వం పడిపోకుండా ప్రతిపక్షాలే కాపాడుకొంటున్నాయి.

 

బహుశః రాష్ట్ర చరిత్రలో మరే ముఖ్యమంత్రికి ఇటువంటి మహద్భాగ్యం దక్కదు. ప్రభుత్వాన్ని కూల్చేయాలని చూసే ప్రతిపక్షాలను మనం చూసాము గానీ, (అవిశ్వాసం పెట్టి కూడా) ప్రభుత్వాన్ని కాపాడుకొనే ప్రతిపక్షాలను ఎన్నడూ చూడలేదు.

 

ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, కిరణ్ కుమార్ రెడ్డి ఉనంత కాలం మీ బ్రతుకులింతే! అంటూ (కాంగ్రెస్ పార్టీని ఎన్నుకొన్న ప్రజలను) కాంగ్రెస్ పార్టీని శపిస్తూ రివ్వుమని దూసుకువచ్చిన జగన్నన్నవదిలిన బాణం ప్రజల గుండెల్లో బాగానే గుచ్చుకొంది. రాజన్నరాజ్యం కావాలనుకొంటే కాంగ్రెస్ పార్టీని కూలదోయక తప్పదు అని షర్మిల అంటుంటే, కేంద్రంలో వేరే ప్రత్యామ్నాయం లేదు గనుక కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఈయక తప్పదు అని, విజయమ్మ ముక్తాయింపు.

 

కిరణ్ కుమార్ రెడ్డి తన ప్రభుత్వాన్ని దమ్ముంటే కూల్చమని ప్రతిపక్షాలకు సవాలు విసిరారు గనుక అవిశ్వాసం పెడితే పెట్టవచ్చును. కానీ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఈయమని కనీసం విజ్ఞప్తి కూడా చేయక మునుపే, విజయమ్మగారు సోనియమ్మ హస్తం అందుకునే ప్రయత్నం చేశారు.

 

ఇక, ఏ పార్టీ తోక పట్టుకొని 2009 ఎన్నికల గోదారి ఈదారో మరిచిపోయిన నాయుడుగారు, ఇప్పుడు ఆ తోక పట్టుకోవడానికే నామోషీగా భావిస్తూ, కాంగ్రెస్ పార్టీ వల్ల మన రాష్ట్రానికి ఎంత తీవ్ర నష్టం వాటిల్లుతోందో ప్రజలకు వివరించేందుకు తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా రేయనక, పగలనకా, ఎండనకా, వాననకా ఊరూరు తిరుగుతూ చాలా శ్రమిస్తున్నారు.

 

ఆయన పాదయాత్రలో ఎవరో పామరులు కొందరు ‘అటువంటప్పుడు మీరే స్వయంగా అవిశ్వాసం పెట్టి కాంగ్రెస్ పార్టీని గద్దె దింపేయొచ్చును కదా?’ అని అడిగితే ‘తగిన సమయంలో తగిన నిర్ణయం’ అంటూ ఒక పడికట్టు మంత్రం ఉపదేశించి చంద్రబాబు ముందుకు సాగిపోతారు. ఎవరి నిస్సహాయతలు వారివి.

 

ఎవరి లెక్కలు వారివి. తమ ఈ అవిశ్వాసవిశ్వాసాల డ్రామాలు, పొత్తులూ, కుమ్మక్కులూ, పార్టీ ఫిరాయింపుల వెనుక కారణాలు ఏవీ కూడా సామాన్య ప్రజలకు అర్ధం కావనే భ్రమలో ఉన్న మన మహా మేదావులయిన రాజకీయ నాయకులు ప్రజలను మభ్య పెట్టె ప్రయత్నంలో చాలా చమటోడుస్తున్నారు. మరి ప్రజలు వారి కష్టాన్ని గుర్తించి వచ్చే ఎన్నికలలో సరయిన తీర్పునిస్తే బాగుంటుంది.