పైసా వసూల్.. బీజేపీలో కార్పొరేటర్ టిక్కెట్ కి కూడా కోట్లు పలుకుతుంది

నిజామాబాద్ కమలంలో వసూళ్ల దందా అంశం కలకలం రేపుతోంది. బల్దియా ఎన్నికల నగారా మోగక ముందే బిజెపిలో టిక్కెట్ల లొల్లి రచ్చకెక్కింది. పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించి ఊపుమీదున్నారు బీజేపీ నేతలు. నిజామాబాద్ కమలంలో తాజాగా ఓ అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కార్పొరేటర్ టికెట్లు, కౌన్సిలర్ టికెట్లు ఇప్పిస్తామని కొందరు నాయకులు వసూళ్ల దందాకు తెర లేపడం విమర్శలకు దారి తీసింది. నిజామాబాద్ లో జరిగిన బిజెపి నగర కమిటీ సమావేశంలో ఈ వ్యవహారం పై ఫిర్యాదు రావడంతో పార్టీలో ఒక్కసారిగా కలకలం రేగింది. తమకు రాష్ట్ర స్థాయి నాయకులతో పరిచయాలు ఉన్నాయని, జాతీయ స్థాయి నేతలు కూడా తెలుసు అని చెప్పి కొందరు డబ్బులు వసూలు చేస్తున్నట్టు ద్వితీయ శ్రేణి నాయకుల్లో ఆశావహులు ఫిర్యాదు చేశారు.

నిజామాబాద్ కార్పొరేషన్ లో కార్పొరేటర్, ఆర్మూర్ భీమ్ గల్ మునిసిపాలిటీల్లో కౌన్సిలర్ టిక్కెట్ల కోసం ఆ పార్టీ ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. వారి ఉత్సాహాన్ని కొందరు నేతలు క్యాష్ చేసుకునే పనిలో పడిపోయారు. బిజెపి నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి ఈ విషయంలో బహిరంగ ప్రకటన విడుదల చేశారు. కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికల్లో టికెట్లిస్తామని, పదవులు ఇప్పిస్తామని కొందరు డబ్బులు తీసుకుంటున్నట్లు జిల్లా పార్టీకి ఫిర్యాదులు అందాయి. అలాంటి వ్యక్తులు మీ వద్దకు వస్తే జిల్లా పార్టీకి ఫిర్యాదు చేయండి అంటూ ప్రకటించారు. 

బీజేపీలో కార్పొరేటర్ టికెట్లు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడే స్వయంగా బహిరంగ ప్రకటన చేయడంతో ఆ వసూల్ రాజాలు ఎవరు అనే చర్చ పార్టీ వర్గాల్లో ప్రారంభమైంది. కేవలం నిజామాబాద్ కార్పొరేషన్ లోనే ఈ వ్యవహారం కొనసాగిందా, మిగిలిన మునిసిపాలిటీల్లోనూ ఇలాంటి దందాలు ఏమైనా సాగుతున్నాయా అనే అంశంపై పార్టీ అప్రమత్తమైంది. అమాయక కార్యకర్తలు, నాయకులు నష్టపోవద్దనే ఉద్దేశం తోనే ముందస్తుగా క్యాడర్ ను జిల్లా అంతటా అప్రమత్తం చేసేలా బహిరంగ ప్రకటన చేసినట్టు నేతలు కూడా చెప్తున్నారు. మొత్తానికి ఈ వ్యవహారం పార్టీ పరువు పోయిందని పార్టీ వర్గాలే అంటున్నాయి.