ఒక కూతురికి న్యాయం జరిగింది.. నా కూతురి ఆత్మకు శాంతి ఎప్పుడు?: నిర్భయ తల్లి ఆవేదన

 

 

హైదరాబాద్ శివారు శంషాబాద్ వద్ద వెటర్నరీ డాక్టర్ దిశపై అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి హతమార్చిన నలుగురు కామాంధులు మహమ్మద్ పాషా, జొల్లు నవీన్, జొల్లు శివ, చెన్నకేశవులను పోలీసులు ఎన్ కౌంటర్ చేయడంపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి. ఇలాంటి ఘాతుకాలకు పాల్పడిన వారికి సరైన శిక్ష పడిందని, బాధితురాలి కుటుంబానికి సత్వర న్యాయం అందించినట్టయిందని అంటున్నారు. 

ఢిల్లీలో అత్యాచార బాధితురాలు నిర్భయ తల్లి ఆశాదేవి కూడా ఈ ఎన్ కౌంటర్ పై సంతోషాన్ని వ్యక్తం చేశారు. నలుగురు నిందితులను ఎన్ కౌంటర్ చేయడం తనకు ఆనందాన్ని ఇస్తోందని అన్నారు. 2012లో నిర్భయ ఘటన తర్వాత తనకు అయిన గాయాలకు ఈ ఎన్‌కౌంటర్ ఆయింట్‌మెంట్ రాసినట్లుగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. దిశ కుటుంబానికి త్వరగా న్యాయం జరిగిందని ఆశా దేవి అన్నారు. ఈ విషయంలో పోలీసులు అత్యాచార నిందితులకు సరైన శిక్ష విధించారని అన్నారు. ఈ ఎన్‌కౌంటర్‌తో ఇలాంటి ఘోరమైన నేరాలకు పాల్పడేవారిలో భయం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. ఈ ఎన్ కౌంటర్ తో దిశ ఆత్మ శాంతించి ఉంటుందని చెప్పారు. 

ఇప్పటికైనా ఒక కూతురికి న్యాయం జరిగిందని, తెలంగాణ పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. తన కూతురు నిర్భయ కోసం ఏడేళ్లుగా పోరాడుతున్నానని నా కుమార్తెకు న్యాయం ఎప్పుడు చేస్తారు అని ఆశాదేవి ప్రశ్నించారు. తన కుమార్తె నిర్భయ విషయంలో కూడా పోలీసులు ఇదే తరహా చర్యలకు దిగాలని తాను కోరుకుంటున్నానని అన్నారు. ఏడేళ్లు ముగిసిపోయినప్పటికీ తనకు న్యాయం దక్కలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం కోసం తాను ఇప్పటికీ కోర్టు చుట్టూ తిరుగుతున్నానని అన్నారు. నిర్భయ కేసులో దోషులుగా తేలిన వారు ఇంకా జీవించే ఉన్నారనే విషయాన్ని తాను పదే, పదే గుర్తు చేయాల్సి వస్తోందని వాపోయారు. 

తన కుమార్తెపై అత్యాచారానికి, హత్యకు పాల్పడిన వారికి ఉరిశిక్ష విధించినప్పుడే తన కుమార్తె ఆత్మకు శాంతి లభిస్తుందని ఆశాదేవి చెప్పారు. తన కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ చాలామందిని కలిశానని, అందరూ హామీలు, భరోసాలు ఇచ్చిన వారేనని అన్నారు. నిర్భయ నిందితులకు సత్వరమే ఉరి శిక్షను విధించాలని తాను న్యాయ వ్యవస్థకు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు.