తీహార్ జైలులో కలకలం.. నిర్భయ దోషి ఆత్మహత్యాయత్నం

నిర్బయ దోషులకు ఢిల్లీ కోర్టు డెత్ వారెంట్ జారీచేసిన విషయం తెలిసిందే. నలుగురు దోషులనూ మార్చి 3న ఉదయం 6 గంటలకు తీహార్ జైల్లో ఉరితీయనున్నారు. ఈ నేపథ్యంలో నిర్బయ దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. తీహార్ జైలులో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉన్న నిర్భయ దోషి వినయ్ శర్మ.. తన సెల్‌లోని గోడకు తల బాదుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. దీనిని గమనించిన సిబ్బంది అతడిని వైద్యం కోసం హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించారు.

ఫిబ్రవరి 16న జరిగిన ఈ ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వినయ్‌ శర్మ గోడకు తల బాదుకుని గాయపర్చుకున్నాడు. ఊచల మధ్య చెయ్యి ఇరికించుకుని విరగొట్టుకోవాలని యత్నించినట్లు కూడా సమాచారం మరణశిక్ష నుంచి బయటపడటానికి దారులన్నీ మూసుకుపోవడంతో వినయ్‌ శర్మ ఈ మార్గాన్ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. అతని మానసిక పరిస్థితి బాగాలేదని చెప్పి ఉరిని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. వినయ్ శర్మ తరఫు న్యాయవాది కూడా.. వినయ్ శర్మ మానసిక వ్యాధికి గురయ్యాడని, మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న అతడికి ఉరి అమలు చేయడం కష్టమని తెలిపారు. ఇదంతా చూస్తుంటే ఉరిని తప్పించుకోవడానికి ఎన్ని డ్రామాలైన ఆడేలా ఉన్నారు. మరి ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన ఉరి.. మార్చి 3న అయినా వారి మెడకి పడుతుందేమో చూడాలి.