తమిళనాడులో తండ్రి కొడుకుల లాకప్ డెత్.. ఎన్ హెచార్సీ సీరియస్

తమిళనాడులోని ట్యూటికోరిన్ జిల్లాలో తండ్రి, కొడుకుల లాకప్ డెత్ వ్యవహారం దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. జస్టిస్ ఫర్ జయరాజ్ అండ్ ఫెనిక్స్ అంటూ సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్న నేపథ్యంలో తాజాగా ఈ కేసు ఎన్ హెచ్ ఆర్ సి కి చేరింది. దీని పై వివరణ ఇవ్వాలంటూ తమిళనాడు డీజీపీ, ఆ రాష్ట్ర జైళ్ల శాఖ ఐజీ, ట్యూటికోరిన్ ఎస్పీలకు జాతీయ మానవ హక్కుల సంఘం (NHRC) నోటీసులు జారీ చేసింది. జయరాజ్, ఫెనిక్స్ లాకప్ మరణాలకు సంబంధించి ఆరువారాల్లోగా పూర్తి నివేదిక సమర్పించాలనిఅలాగే దీనికి సంబంధిత అధికారులు తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని ఎన్ హెచ్ ఆర్ సి స్పష్టంచేసింది.

ట్యూటికోరిన్ జిల్లాలోని సత్తాన్‌కుళంలో తండ్రి కుమారులైన జయరాజ్, ఫెనిక్స్ మొబైల్ ఫోన్ షాప్ నడుపుతున్నారు. ఈ నెల 19న లాక్‌డౌన్ నిబంధనలకు విరుద్ధంగా షాప్‌ను తెరిచి ఉంచారన్న కారణంతో స్థానిక పోలీసులకు, వారిద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. తరువాత వీరిద్దరిని అరెస్టు చేసిన పోలీసులు స్టేషన్ లో ఉంచి తీవ్రంగా హింసించి తరువాత రిమాండ్‌పై జైలుకు పంపారు. ఆ తర్వాత కోవిల్‌పట్టి ఆస్పత్రిలో చికిత్స అందిస్తుండగా ఫెనిక్స్ 21న మరణించగా ఆ మరుసటి రోజు ఉదయం ఆయన తండ్రి జయరాజ్ మృతి చెందారు. వారిద్దరూ గుండెపోటుతో మృతి చెందినట్లు పోలీసులు చెప్పారు. అయితే పోలీస్ స్టేషన్‌లో వీరిద్దరిని పోలీసులు మలద్వారం లో లాఠీలతో అమానుషంగా కొట్టడం వల్ల తీవ్ర రక్తస్రావమై వారు మరణించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనికీ బాధ్యులైన పోలీసులపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వారి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. వారి వాదనకు బలపర్చేలా ఆ రోజు రాత్రంతా పోలీసులు తండ్రి, కొడుకులను కొట్టినట్లు అదే పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్నఒక మహిళా కానిస్టేబుల్ మేజిస్ట్రేట్‌కు వాంగ్మూలం ఇచ్చారు.

తాజాగా నిన్న ఈ ఘటన జరిగిన పోలీస్ స్టేషన్ లో ఎస్సై గా పని చేస్తున్న రఘు గణేష్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు. నిన్న రాత్రి మరో ఇద్దరు పొలిసు అధికారులను అరెస్ట్ చేసారు. ఈ పోలీసు స్టేషన్ లో ని ఎస్సైలు రఘు గణేష్, బాలకృష్ణన్ ల పై మర్డర్ కేసు వంటి తీవ్రమైన కేసులు పెట్టారు. ఈ కేసును సిఐడి ఐజి నేతృత్వం లోని 12 టీమ్ లు దర్యాప్తు చేస్తున్నాయి.