పెళ్లికానుకను చూసి ఓ జంట విస్తుపోయింది... ప్యాకింగ్ విప్పి చూస్తే డబ్బా నిండా ఏముందంటే..!

 

ప్రజల ఆలోచనా ధోరణి మారుతోంది. పరిస్థితులకు అనుగుణంగా క్రియేటివిటీ పెరుగుతోంది. సోషల్ మీడియా రాకతో తమ అభిప్రాయాలను నిర్భయంగా వెల్లడిస్తున్న జనం... ప్రజా సమస్యలపైనా... ప్రభుత్వ విధానాలపైనా... అంతే ఘాటుగా స్పందిస్తున్నారు. అయితే, కొందరు క్రియేటివిటీని ఉపయోగిస్తూ వెరైటీగా స్పందిస్తూ అందర్నీ ఆకట్టుకుంటున్నారు. ఒకే ఒక్క చిన్న పనితో సమస్య తీవ్రతను అందరికీ తెలిసేలా చేస్తున్నారు.

సాధారణంగా ఎవరైనా పెళ్లికెళ్తే ఏం చేస్తారు... నవ దంపతుల కోసం నగలో... నగదో... బట్టలో... లేక ఏదైనా మంచి బహుమతో తీసుకెళ్తాం... కానీ ఏపీలో ఓ యువకుడు వెరైటీ బహుమతి ఇచ్చాడు. విశాఖ జిల్లా అనకాపల్లి మండలం కొత్త తలారివానిపాలెంలో ... దంపతులకు ఇసుకను బహుమానంగా ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆంధ్రప్రదేశ్ లో ఇసుక సమస్య తీవ్రతను తెలియచెబుతూ... ఇసుకను డబ్బాలో ప్యాక్ చేసి గిఫ్ట్ గా ఇఛ్చాడు. మార్కెట్లో ఇసుక తప్ప అన్నీ దొరుకుతున్నాయని... ఏపీలో ఇప్పుడు ఇసుక ...బంగారం కన్నా విలువైనది అంటూ సరదాగా కొత్త జంటకు డబ్బాడు ఇసుకను ప్రెజంట్ చేశారు. పెళ్లికొచ్చిన అతిథులంతా ఈ శాండ్ గిప్ట్ ను చూసి విస్తుపోయారు.

అయితే, ఇసుక కొరత ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇదో ఉదాహరణ. ఇదొక్కటే కాదు... ఇటీవల ఓ తాపీమేస్తీ... తన బంధువులను, స్నేహితులను భోజనానికి ఇంటికి పిలిచి... ప్లేట్లలో ఇసుకను వడ్డించి... తమ సమస్యను తెలియజెప్పాడు. ఇసుక కొరతతో తమకు పని లేకుండా పోయిందని, కనీసం తినడానికి తిండి లేకుండా ఇబ్బందులు పడుతున్నామని తమ బంధువులకు, స్నేహితులకు తెలిసేలా చేశాడు. మొత్తానికి, ప్రజాసమస్యలను, తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను చిన్న చిన్న పనులతో క్రియేటివిటీ ఉపయోగిస్తూ... సమస్య తీవ్రతను అటు ప్రభుత్వం దృష్టికి... ఇటు ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నారు.