వల్లభనేని వంశీ ఎపిసోడ్ లో కొత్త ట్విస్ట్... ఫిరాయింపులకు లైన్ క్లియర్..!

 

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎపిసోడ్ కొత్త మలుపు తిరిగింది. తెలుగుదేశం ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన వంశీపై, ఆ తర్వాత టీడీపీ కూడా సస్పెన్షన్ వేటేసింది. అనంతరం చంద్రబాబు, లోకేష్ పై ఘాటు విమర్శలు చేసి, తెలుగుదేశంలో కాక పుట్టించారు. అయితే, అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగుతున్నవేళ వంశీ... ఎటువైపు కూర్చుంటారోనన్న ఆసక్తి ఏర్పడింది. వైసీపీలో చేరతానని వల్లభనేని ప్రకటించిన నేపథ్యంలో అధికారపక్షం వైపు కూర్చుంటారేమోనని అంతా భావించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ, టీడీపీ వైపే... వెనుక పక్కన కూర్చున్న వంశీ... తెలుగుదేశానికి పక్కలో బల్లెం అనే సామెతను మరిపించారు.

అయితే, రెండోరోజు వల్లభనేని వంశీ మాట్లాడేందుకు ప్రయత్నించిగా చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. వంశీ మాట్లాడటానికి వీల్లేదంటూ టీడీపీ సభ్యులు అడ్డుకున్నారు. వంశీ అసలు ఎమ్మెల్యేగా కొనసాగేందుకు అనర్హుడంటూ బాబు నిప్పులు చెరిగారు. అయితే, బాబు కామెంట్స్ పై అంతే ఘాటుగా స్పందించిన వంశీ... తనకు మాట్లాడే హక్కు ఎందుకు లేదని ప్రశ్నించారు. సీఎం జగన్ ను కలిసినంత మాత్రాన తనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా అంటూ బాబును నిలదీశారు. తాను అనేక ప్రజాసమస్యలపై సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశానని, కానీ తనపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేయించారని మండిపడ్డారు. మంచి పనులు ఎవరూ చేసినా తాను అభినందిస్తానన్న వంశీ... అలాగే జగన్ ను కూడా ప్రశంసించానని తెలిపారు. అయితే, పచ్చ బ్యాచ్ తనపై విమర్శలు చేస్తోందని మండిపడ్డారు.

తాను, ఎమ్మెల్యేనని, తనకూ మాట్లాడే హక్కు ఉందన్న వల్లభనేని వంశీ... ఇకపై తాను టీడీపీతో కొనసాగలేనని, తనను ప్రత్యేక సభ్యుడిగా గుర్తించాలంటూ స్పీకర్ ను కోరారు. దాంతో, వంశీని ప్రత్యేక సభ్యుడిగా గుర్తిస్తానంటూ స్పీకర్ ప్రకటించారు. స్పీకర్ ప్రకటనతో పార్టీ ఫిరాయింపులు కొత్త రూటు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. తెలుగుదేశం నుంచి బయటికి వచ్చే ఎమ్మెల్యేలను వైసీపీలో చేర్చుకోకుండానే, అసెంబ్లీలో ప్రత్యేక సభ్యులుగా గుర్తించే అవకాశం కనిపిస్తోంది.