చెన్నంపల్లి కోటలో నిధుల కోసం తవ్వకాలు.. బాబు&కో ని ఇరికించేందుకు జగన్ సర్కార్ ప్లాన్!

అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ఉన్న సంపదను మించిపోయే స్థాయిలో చెన్నంపల్లి కోటలో నిధి నిక్షేపాలు ఉన్నాయని చాలా ఏళ్ల నుంచి ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే 2016 లో చెన్నంపల్లికి ఓ స్వామి వచ్చి కోటలో తవ్వకాలు జరపడానికి సహకరిస్తే గ్రామం లోని ఒక్కింటికి కిలో బంగారం చొప్పున ఇస్తానని ఆశ పెట్టాడు. దీంతో ఆ కోటలో నిజంగానే నిధినిక్షేపాల ఉండొచ్చన్న భావన ప్రజల్లో మరింత బలపడింది. ఈ తరుణం లోనే 2017 డిసెంబర్ లో అధికారికంగా చెన్నంపల్లి కోటలో తవ్వకాలు ప్రారంభమయ్యాయి. భారీ పోలీసు బందోబస్తు మధ్య తవ్వకాలు చేపట్టారు. నిధుల పేరిట ఎంతో చారిత్రాత్మకమైన చెన్నంపల్లికోటను ధ్వంసం చేయొద్దు అంటూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానికులు ఆందోళనలు చేపట్టారు. అయినా తవ్వకాలు మాత్రం కొనసాగాయి.

అప్పటికే చెన్నంపల్లి కోటలో గుప్త నిధుల అన్వేషణలు పేరుతో అనేక మంది రహస్యంగా తవ్వకాలు సాగించిన సందర్బాలున్నాయి. గుప్త నిధుల అన్వేషణ పై అనేకసార్లు జిల్లా అధికారులకు ఫిర్యాదులు కూడా అందాయి. ఈ నేపధ్యంలో గుప్త నిధుల గుట్టు రట్టు చేసేందుకు నాటి ప్రభుత్వం ఇక్కడ తవ్వకాలు చేపట్టిందని అధికారులు చెప్పుకొచ్చారు. ఆరు నెలలకు పైగా సాగిన ఈ తవ్వకాల కోసం భారీగానే ఖర్చు పెట్టినట్లు సమాచారం. అయితే కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఈ వ్యవహారం ముగిసింది. ఎంత కష్ట పడి తవ్వకాలు చేపట్టిన కోట పరిసర ప్రాంతాల్లో ఎలాంటి నిధి నిక్షేపాలు బయట పడలేదు. ఏనుగు దంతాలు, గుర్రం ఎముకలు, సీతారాముల విగ్రహాలు వంటివి మాత్రమే దొరికాయి. అనంతరం ఇక్కడ తవ్వకాలకు పూర్తిగా స్వస్తి పలికారు. 

సార్వత్రిక ఎన్నికలు రావడంతో అధికారులు కోటలో తవ్వకాల పై దృష్టి కూడా సారించలేదు. చెన్నంపల్లి కోటలో అధికారుల తవ్వకాలు జరిపి అణువణువూ శోధించినా ఏం దొరకకపోవడంతో.. ఇక్కడ ఎలాంటి నిధినిక్షేపాలు లేవన్న భావన ప్రజల్లో ఏర్పడింది. ఈ క్రమం లోనే రాష్ట్రంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొలువుదీరింది. చెన్నంపల్లి కోటలో నిధినిక్షేపాల కోసం గత ప్రభుత్వం ప్రజా ధనాన్ని వెచ్చించి తవ్వకాలు జరిపింది అన్న విషయాన్ని స్థానిక వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తాజాగా తెరపైకి తెచ్చారు. ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ విషయం పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో చర్చించినట్టు సమాచారం. సీఎం జగన్ ఈ అంశంపై చర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారని టాక్. నాటి తవ్వకాల పై పూర్తిస్థాయిలో విచారణ జరిపేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. మరోవైపు పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీ దేవి రంగం లోకి దిగారు. టిడిపి ప్రభుత్వ హయాంలో చెన్నంపల్లి కోటలో జరిపిన తవ్వకాల పై ఆరా తీస్తున్నారు. అవసరమైతే దీనిపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించే అవకాశం ఉంది. 

ప్రజా ధనం వృధా చారిత్రక కట్టడంలో ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరిపి కోటను ధ్వంసం చేశారనే అభియోగాలతో విచారణ జరిపి అందుకు బాధ్యులైన టిడిపి నేతల పై కేసులు పెట్టేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు భారీ స్కెచ్ వేశారు. నాటీ సీఎం చంద్రబాబు సహా ఆయన కుమారుడు లోకేష్, నాటి డిప్యూటీ సీఎం కేయి క్రిష్ణమూర్తిలని ఈ కేసులో ఇరికించివచ్చని కొందరు చెవులు కొరుక్కుంటున్నారు. గతంలో చెన్నంపల్లి కోటలో తవ్వకాలు మొదలైనప్పుడు అంశం ఎలా చర్చకు దారి తీసిందో ఇప్పుడు ఆ తవ్వకాల పై జగన్ ప్రభుత్వం విచారణ చేపట్టబోతోందన్న వార్త కూడా అంతే ఆసక్తికరంగా మారింది. దీనికి రాజకీయ అంశాలు కూడా తోడు కావడంతో అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విపక్ష టిడిపి మధ్య కొత్త సెగ రాజుకునేలా కనిపిస్తోంది. ఈ అంశం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.