ఐక్యతే అసలు టార్గెట్! మణిక్కమ్‌ మేజిక్ చేసేనా? 

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కొత్త ఇన్‌చార్జి మణిక్కమ్‌ ఠాగూర్‌ తన మార్క్ చూపిస్తున్నారు. హైదరాబాద్ వచ్చిన ఠాగూర్ రాష్ట్ర పార్టీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. క్షేత్రస్థాయి పోరాటాలు, ఉద్యమాలతో నిరంతరం జనం మధ్యనే ఉండాలంటూ దిశా నిర్దేశం చేశారు. అయితే తెలంగాణ కాంగ్రెస్ లో అసలు సమస్య నేతల మధ్య విభేదాలే. వర్గపోరుతోనే పార్టీ తీవ్రంగా నష్టపోతోంది. అన్ని జిల్లాల్లోనూ నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. మాణిక్కమ్ ఠాగూర్ కి ఇది ఇప్పుడు అసలు సమస్యగా మారింది. 

 

మణిక్కమ్‌ ఠాగూర్ కు స్వాగతం చెప్పే క్రమంలోనూ శంషాబాద్ ఎయిర్ పోర్టు కాంగ్రెస్ వర్గ పోరు బయటపడింది. రాష్ట్ర నేతలు ఎవరికి వారే బల ప్రదర్శనకు దిగారు. తమ అనుచరులను భారీగా తీసుకొచ్చారు. దీంతో వచ్చిన కార్యకర్తలు తమ నాయకుడికి జై కొడుతూ హడావుడి చేశారు. ఇక ఠాగూర్ ను రిసీవ్ చేసుకునేందుకు నేతలు పోటీ పడటంతో ఎయిర్ పోర్టు దగ్గర స్వల్ప తొక్కిసలాట కూడా జరిగింది. కాంగ్రెస్ నేతల తీరుపై మాణిక్కమ్ ఠాగూర్ అసహనం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర పార్టీని ఆయన ఎలా గాడిలో పెడతారన్నది చర్చగా మారింది.

 

పార్టీ తనను తెలంగాణ ఇంచార్జ్ గా నియమించినప్పటి నుంచే మాణిక్కమ్ తన పని మెదలు పెట్టినట్లు తెలుస్తోంది. పార్లమెంట్ సమావేశాలకు హాజరవుతూనే రాష్ట్ర నేతలతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడినట్లు చెబుతున్నారు. రాష్ట్రంలో చేపట్టబోయే కార్యక్రమాలపైనా ముఖ్య నేతలతో చర్చించారట. త్వరలో జరగనున్న దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికతో పాటు రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ఠాగూర్ సవాల్ గా తీసుకున్నారని గాంధీభవన్ వర్గాల సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల కోసం మాణిక్కమ్ వ్యూహరచన సిద్ధం చేశారని చెబుతున్నారు. అందుకే హైదరాబాద్ వచ్చిన వెంటనే ఆయన దుబ్బాక ఉప ఎన్నిక, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, జీహెచ్‌ఎంసీ, ఖమ్మం, వరంగల్‌ కార్పొరేషన్ల ఎన్నికలపై నేతలతో చర్చించారు. ఎన్నికలు జరిగే జిల్లాల నేతలతో ప్రత్యేకంగా మాట్లాడారు. దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారానికి నేతలంతా వెళ్లాలని ఆదేశించారట మాణిక్కమ్. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి.. ఓడిపోయిన అభ్యర్థులతోనూ సమావేశమయ్యారు. ఏఐసీసీ తలపెట్టిన కార్యక్రమాల నిర్వహణ, పార్టీ సభ్యత్వ నమోదుపై చర్చించారు.  

 

గాంధీభవన్‌లో టీపీసీసీ కోర్‌ కమిటీతో సమావేశమైన మాణిక్కమ్.. తన స్టాండ్ క్లియర్ గా చెప్పేశారట. అందరూ క్రమశిక్షణతో ఐకమత్యంగా పనిచేస్తేనే రానున్న ఎన్నికల్లో విజయం సాధిస్తామని చెప్పారట. సోనియాగాంధీ త్యాగం వల్లనే తెలంగాణ ఏర్పాటైందన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు ఠాగూర్. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి తీసుకొచ్చి సోనియాకు బహుమతిగా ఇవ్వడమే మన లక్ష్యమని దిశానిర్దేశం చేశారని తెలుస్తోంది. అయితే మాణిక్కమ్ ఠాగూర్ చర్యలతో కాంగ్రెస్ లో వర్గ పోరు ఎంతవరకు సమసి పోతుందో ఇప్పుడే చెప్పలేం. నేతలంతా విభేదాలు పక్కన పెట్టి పని చేస్తే తప్ప పార్టీకి రాష్ట్రంలో మంచి రోజులు రావని కాంగ్రెస్ కార్యకర్తలు ఓపెన్ గానే చెప్పేస్తున్నారు. సో.. రాష్ట్ర కాంగ్రెస్ నేతలను ఏకతాటి పైకి తీసుకురావడంలో మణిక్కమ్ ఠాగూర్ ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి మరీ.