నో డ్యూస్ సర్టిఫికెట్ ఉంటేనే నామినేషన్... మున్సిపోల్స్ లో కొత్త రూల్...

నోటీసులు మీద నోటీసులు ఇచ్చారు... ఇంటింటికీ వందసార్లు తిరిగారు... డిస్కౌంట్ ఆఫర్లు కూడా ఇచ్చారు... కానీ వాళ్లు దిగిరాలేదు. అధికారుల హెచ్చరికలను సైతం లెక్క చేయలేదు. మొండి బకాయిలు చెల్లించాలంటూ ఎన్నిసార్లు మొత్తుకున్నా కదల్లేదూ మెదల్లేదు. కానీ, మున్సిపల్ ఎన్నికల పుణ్యమా అంటూ... వాళ్లే స్వయంగా వచ్చి మొండి బకాయిలను చెల్లిస్తున్నారు. 120 మున్సిపాలిటీలు, 19 కార్పొరేషన్లకు జనవరి 22న ఎన్నికలు జరగనుండటంతో బరిలోకి దిగాలనుకుంటోన్న వాళ్లు ముందుగా పన్ను బకాయిలు క్లియర్ చేసుకునే పనిలో పడ్డారు. నామినేషన్లు దాఖలు చేయాలంటే, ఎలాంటి పెండింగ్ బకాయిలు ఉండకూడదనే నిబంధన ఉండటంతో నో డ్యూస్ సర్టిఫికెట్ కోసం మొండి బకాయిలన్నీ చెల్లించేస్తున్నారు. అలాగే, అభ్యర్ధులను ప్రతిపాదించే వాళ్లకు కూడా బకాయిలు ఉండకూడదనే రూల్ ఉండటంతో... వాళ్లు కూడా పన్నులు చెల్లించేందుకు క్యూ కడుతున్నారు.

పన్ను బకాయిలుంటే, మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి అనర్హులనే నిబంధన ఉండటంతో... బరిలోకి దిగాలనుకుంటున్న బడాబాబులంతా తమతమ బకాయిలను చెల్లించి నో డ్యూస్ సర్టిఫికెట్లు తీసుకెళ్తున్నారు. దాంతో, ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయిన మొండి బకాయిలు వసూలు అవుతున్నాయని అధికారులు అంటున్నారు. పన్నులు చెల్లించేందుకు బడాబాబులు తరలివస్తుండటంతో ాయా మున్సిపాలిటీల్లో ప్రత్యేక కౌంటర్లను సైతం ఏర్పాటు చేశారు. మొండి బకాయిలున్న వాళ్లంతా బడాబాబులు, ఎక్కువగా పొలిటికల్ లీడర్సే ఉండటంతో భారీ మొత్తంలోనే వసూళ్లు జరుగుతున్నాయని అంటున్నారు. కొన్ని మున్సిపాలిటీల్లో అయితే, కోట్లల్లో బకాయిలు పేరుకుపోయాయని, అయితే ఎన్నిసార్లు నోటీసులు ఇఛ్చినా కట్టనివాళ్లు సైతం ఇప్పుడు స్వచ్ఛందంగా వచ్చి చెల్లిస్తున్నారని అధికారులు అంటున్నారు.

ఏ మున్సిపాలిటీలోనైనా, సాధరాణ రోజుల్లో కనీసం 40వేలు కూడా పన్ను ఆదాయం రాదని, కానీ ఇప్పుడు రోజూ లక్షల్లో బకాయిలు చెల్లిస్తున్నారని చెబుతున్నారు. అంతేకాదు, వందలసార్లు తిరిగినా వసూలు కాని మొండి బకాయిలు సైతం... మున్సిపల్ ఎన్నికల పుణ్యమా అని... వాళ్లే స్వయంగా వచ్చి చెల్లిస్తున్నారంటూ అధికారులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.