కొత్త పార్టీ ప్రచారానికి ప్రమోటర్స్ ఎవరో?

 

గత వారం పదిరోజులుగా సమైక్యాంధ్ర పోస్టర్లు, హోర్డింగ్స్, టీవీ చానళ్ళలలో జోరుగా ప్రకటనలు సీమాంధ్ర ప్రజలను ఉరుములేని వర్షంలా కమ్ముకొంటున్నాయి. ప్రచారం ఇంత జోరుగా సాగుతున్న ఇంతవరకు ఈ ప్రచారం వెనుక ఎవరున్నారనే సంగతి చాలా గోప్యంగా ఉంచబడటం విశేషం.

 

పార్టీ స్థాపించి, దాని కార్యవర్గ సభ్యుల పేర్లు ప్రకటించి ఇంత భారీ ప్రచారం చేసి ఉండి ఉంటే చేస్తున్న ఖర్చుకి ఒక అర్ధం, పరమార్ధం ఉండేవి. కానీ కనీసం పార్టీ పేరు, వ్యక్తుల ఫోటోలు కూడా లేకుండా కోట్లు ఖర్చు చేసి ఇంత భారీ ఎత్తున ప్రచారం చేయడం చూస్తే, కొత్త పార్టీ వెనుక మంచి ‘సౌండ్ పార్టీలే’ ఉన్నాయని అర్ధమవుతోంది.

 

ఈ ప్రచారంలో నినాదాలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెపుతున్నమాటలే గనుక ఆయనే ఈ ఖర్చు అంతా భరిస్తున్నారా? అనే అనుమానం కలుగుతుంది. ఒకే ఒక వ్యక్తి ఇంత భారీగా ఖర్చు పెట్టడం కష్టమే కాదు చాల రిస్క్ తో కూడుకొన్న వ్యవహారం. గనుక మొదటి నుండి ఆయనను వెనకేసుకు వస్తూ అండగా నిలబడిన విజయవాడ యంపీ లగడపాటి రాజగోపాల్, మంత్రులు టీజీ వెంకటేష్, శైలజానాథ్, గంటా శ్రీనివాసరావు తదితరులు బహుశః ఈ ఊరుపేరులేని కొత్త పార్టీకి పార్టనర్స్ మరియు ప్రమోటర్స్ అయ్యుండే అవకాశం ఉంది. వీరు కాక కొత్త పార్టీ పెడితే టికెట్స్ ఆశిస్తున్న లేదా ఖాయం చేసుకొన్నఅభ్యర్ధులు కూడా పెట్టుబడి పెడుతూ ఉండవచ్చును.

 

ఇక ఇందులో తెలుస్తున్నమరో విషయం ఏమిటంటే, ఎన్నికలలో పోటీచేసేందుకయితే ఎంతఖర్చుకయినా వెనుకాడని మన రాజకీయ నేతలు, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం ఇంత చేతి చమురు వదిలించుకోరు. కానీ ఖర్చు చేస్తున్నారంటే అర్ధం కొత్తపార్టీ ఎన్నికలనే లక్ష్యంగా చేసుకొని ఏర్పాటవుతోందని తెలుస్తోంది.

 

ఈరోజు లగడపాటి రాజగోపాల్ మీడియాతో మాట్లాడుతూ “పిచ్చ్ సిద్దమయింది. మరి అది బ్యాటింగ్ కి అనుకూలమో లేక బౌలింగ్ కి అనుకూలమో త్వరలో తేలిపోతుంది,” అని వ్యాక్యానించారు. ఆయన మాటల ప్రకారం బ్యాటింగ్ అంటే కొత్త పార్టీ స్థాపించి ఎన్నికలలో పోటీ చేయడం అనుకొంటే, బౌలింగ్ అంటే రాష్ట్ర విభజన చేస్తున్నకాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కొత్తపార్టీ వెనక్కి తగ్గడంగా అనుకోవచ్చునేమో! అంటే ఈ ఒట్టొట్టి ప్రచారంతో కొత్త పార్టీ స్థాపించబోతున్నట్లు కాంగ్రెస్ అధిష్టానాన్నిభయపెట్టి లొంగదీసుకొని, రాష్ట్ర విభజన విషయంలో వెనక్కితగ్గేలా చేసి కొత్తపార్టీ కూడా వెనక్కి తగ్గుతుందని ఆయన చెపుతున్నారేమో! బహుశః అందుకే ఇంత భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నఎవరి పేర్లు బయటపడకుండా జాగ్రత్తపడుతున్నారు.

 

కానీ, కొత్త పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీకి మొలవబోయే మరో కొత్త కొమ్మేఅయినప్పుడు ఇంకా ఈ ముసుగులో గుద్దులాటలెందుకో? ఈ బ్యాటింగు, బౌలింగ్ దేనికో, ఈ పిచ్చిపిచ్చి పిచ్చులు దేనికో లగడపాటే చెప్పాలి మరి.