కొత్త వి"నాయకులు"

 

వినాయక చవితి వస్తోందంటే చాలు.. ఉత్సవ కమిటీలు హడావిడి అంటా ఇంతా కాదు. పోటాపోటీగా పందిర్లు ఏర్పాటు, విద్యుద్దీపాలంకరణతో ఊరూ వాడా మెరిసిపొతాయి. దోనీ గణపతి, రోబో గణేష్, ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు గణపతి విగ్రహాలను తీర్చిదిద్ది నిలుపుతారు. అందరూ పూజించేది వినాయకుడినే .. కొలిచేది విఘ్ననాయకుడినే .. గణేష్ నవరాత్రులలో మాత్రం వీధికి ఒకలా గణనాధుడు మనకు కనిపిస్తాడు. కొత్త దేవుడండీ ..సరికొత్తా దేవుడండీ అని భక్తులు పాడుకొనేలా వీధి మారేసరికి గణపతి రూపాలు కూడా మారిపోతాయి. గతేడాది సమైక్య, ప్రత్యేక ఉద్యమాల నేపధ్యంలో గణపతి కూడా సీమాంధ్ర, తెలంగాణా రూపాలను సంతరించుకున్నాడు. ప్రస్తుతం విభజన పూర్తి అయిపోయింది. దగ్గరలో వినాయకచవితి కూడా లేదు. కానీ సరికొత్త వినాయకులు పుట్టుకొస్తున్నారు. ఈ వినాయకులు ఎవరని మీరు ఆశ్చర్యపోవద్దు. మన దేశంలో ఏ పని కావాలన్న వినాయకుడి మాదిరిగానే వీరినే ముందు దర్శించుకోవాలి. దణ్ణం పెట్టి ఆశీస్సులు తీసుకోవాలి. దక్షిణ సమర్పించుకోవాలి. ఆనక ప్రసాదాలు నైవేద్యంగా పెట్టాలి. ఇవన్నీ పూర్తి అయితే స్వాముల అనుగ్రహం పొంది కోరుకున్న పని జరుగుతుంది. వీరి దర్శనం అయితే ఇంకా శివుడిని ప్రార్ధించాల్సిన పని కూడా అంతగా ఉండదు. ఆయన రాష్ట్రంలో గవర్నర్, కేంద్రంలో రాష్టపతి లాంటి వాడు. ఆమోదముద్ర వేసి పారేస్తాడు.

 

రాజకీయ నవరాత్రోత్సవాలు వంటి ఎన్నికలకు ప్రకటన వెలువడింది. ఊరుకో రాజకీయ వి"నాయకుడు" కొలువైపోతున్నాడు. ఇందులో ప్రజల విఘ్నాలు తొలగించేది ఎందరో, దక్షిణలు, నైవేద్యాలు మింగేసి దయాదాక్షిణ్యాలు లేకుండా దోచుకునేది ఎందరో భక్తులైన ఓటర్లకు కొద్దిరోజుల్లో తత్త్వం బోధపడనుంది. ఎన్నికల నవరాత్రోత్సవాలు ముగిసేసరికి జనం కొంత మంది నేతాగ్రేసరులను నిమజ్జనం చెసేస్తారు. ఇవన్నీ కొత్తా దేవుళ్ళం అనిపించుకునేందుకు ఈ ఎన్నికల్లో చాలా మంది బరిలోకి దిగుతున్నారు.

 

మ్యాచ్ అయిపోలేదని అందరినీ చివరి బంతి వరకూ గ్రౌండ్లో కూర్చో పెట్టి ప్రత్యేక రాష్రం సినిమాను శుభం కార్డు పడేవరకు చూపించిన నల్లారి వారు పార్టీ పెడుతున్నారు. నిజమండీ నమ్మండీ .. స్వయంగా ఆయనే చెప్పేశారు. ఎన్నికల తరువాత కిరణ్ అనే వినాయకుడు కాంగ్రెస్ లో నిమజ్జనం కాక తప్పదని తెలుగు తమ్ముళ్ళు మైకు పట్టుకు అరుస్తున్నారు. జైలు..బెయిల్ పార్టీగా టీడీపీ నేతలు వర్ణిస్తున్న వై సి పీ కూడా 10 జనపథ్ ఆలయంలో విలీనం జరిగితీరుతుందని.. దమ్ముంటే బెట్టింగ్ కాయమంటున్నారు. ఇక గత ఎన్నికలకు ముందు వచ్చిన చిరంజీవి ..ప్రజరాజ్యం పార్టీ స్థాపించి.. వై ఎస్ రాజ్యం ఏర్పడేందుకు ప్రత్యక్షంగా సహకరించాడు. పరోక్షంగా టీడీపీని అధికారంలోకి రాకుండా అడ్డుకున్నారు మన అందరివాడు. పార్టీ లక్ష్యం నెరవేరకపోయినా ..తన ‘చిరు లక్ష్యం’ మాత్రం నెరవేర్చుకున్నారాయన. ఓటడిగే ఎన్నిక నుంచి చాటుమాటుగా ఎన్నికయ్యే రూటు చేరుకున్నాడు. కాంగ్రెస్ అనే మహాసముద్రంలో తన ప్రజా రాజ్యాన్ని నిమజ్జనం చేశాడీ వినాయకుడు.

 

ఎన్నికలకు ముందు తన సైన్యం బరిలో దిగుతుందని ప్రకటించిన పవన్ కళ్యాణ్ మరో వింత వినాయకుడి అవతారం ఎత్తనున్నాడు. అన్న మాదిరిగానే ఈ ఎన్నికల్లో పవర్ స్టార్ ఎవరిని పవర్ కు దూరం చేస్తాడో అనే టెన్షన్ తో పాత వినాయకులు బిక్క చచ్చిపోయున్నారు. పవన్ ఎవరి పుట్టి ముంచుతాడో అనే భయంతో పార్టీలన్నీ ఎన్నికల నవరాత్రోత్సవ జాగారం చేస్తున్నాయి.

 

ప్రాంతం కార్డుతో మరికొన్ని పార్టీలు, కులం పేరుతొ ఇంకొన్ని పార్టీలు తమ వినాయకులను ప్రతిష్టించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రతి వినాయకచవితికి ఘనంగా పూజలు అందుకునే వినాయకు విగ్రహాలను నవరాత్రోత్సవాలు ముగిసిన వెంటనే నిమజ్జనం ఆనవాయితీ. ఆలాగే ప్రతి ఐదేళ్ళకు ఓసారి జరిగే ఎన్నికల వేడుకల సందర్భంగా కొత్త దేవుళ్ళను నిమజ్జనం చేస్తారు జనం. మరికొందరు వినాయకులు శివాలయాల్లాంటి జాతీయ ప్రాంతీయ పార్టీల కార్యాలయాల ప్రాంగణాలకు చేరుకొని ఉత్సవ విగ్రహాల్లా పూజలు అందుకుంటున్నారు.

 

ఆలె నరేంద్ర, దేవేందర్ గౌడ్ , కాసాని జ్ఞానేశ్వర్, చిరు ప్రజారాజ్యం, విజయశాంతి తల్లి తెలంగాణా, లక్ష్మిపార్వతి, హరికృష్ణ వంటి వారు స్థాపించిన పార్టీలు ఇప్పుడు వికీపీడియా లో వెతికినా దొరకవు. మరి కొత్తా పార్టీలు పెట్టే వారంతా పాత వినాయకులుగానే మిగిలిపోతారా.. లేదంటే గణేష్ మహారాజ్ కీ జై అనిపించుకుంటారా? అనేది ప్రజాస్వామ్యానికి మహా భక్తులైన ఓటఋ మహాశయులు తేలుస్తారు.