భూకంప మృతులు 3218

 

నేపాల్‌లో సంభవించిన భారీ భూకంపం మృతుల సంఖ్య క్షణక్షణానికీ పెరిగిపోతోంది. సోమవారం ఉదయానికి భూకంప మృతుల సంఖ్య 3218గా అధికారులు వెల్లడించారు. ఆదివారం కూడా నేపాల్‌లో అనేకసార్లు భూమి కంపించింది. భూమి కంపించినప్పుడల్లా జనం ఆందోళనలతో తల్లడిల్లుతున్నారు. రాజధాని ఖాట్మండూతో సహా అనేక ప్రాంతాల్లో గుట్టలు గుట్టలుగా వున్న శిథిలాలను తొలగిస్తున్నకొద్దీ మృతదేహాలు భారీ సంఖ్యలో బయటపడుతున్నాయి. మృతదేహాలు పేరుకుపోతే అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం వుండటంతో సామూహికంగా దహనం చేస్తున్నారు. మృతులకు సంబంధించిన వారు ఎవరైనా గుర్తించే అవకాశం కూడా లేకుండా పోయింది. జీవించి వున్నవారే మరణించిన వారికి ఆత్మబంధువులై అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. సహాయ కార్యక్రమాలు జరుగుతూ వుండగానే భారీగా వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయి. భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో భారీ వర్షాలు పడితే పరిస్థితి మరింత చేయిజారిపోతుందని భయపడుతున్నారు. ఇప్పటికే లక్షలాది మంది ప్రజలు రోడ్డు మీదే వుంటున్నారు. రాత్రివేళ చలితో బాదపడుతున్నారు. సాధ్యమైనంత త్వరగా వీరందరికీ పునరావాసం కల్పించడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు.