వైసీపీకి షాక్.. పార్టీ వీడిన కీలక నేత.!!

 

ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ వైసీపీకి షాక్ లు తగులుతున్నాయి. ఆనం రాంనారాయణ రెడ్డి చేరికతో నెల్లూరులో వైసీపీ బలం పెరుగుతుందని జగన్ భావిస్తే.. దానికి భిన్నంగా కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు పార్టీనే వీడుతున్నారు. తాజాగా నెల్లూరు జడ్పీ చైర్మన్‌, వైసీపీ నేత బొమ్మిరెడ్డి రాఘవేంద్రారెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. వైసీపీలో గతకొంత కాలంగా చురుగ్గా ఉన్న బొమ్మిరెడ్డి వెంకటగిరి అసెంబ్లీ టిక్కెట్ ను ఆశిస్తున్నారు. కానీ ఇటీవల పార్టీలో చేరిన ఆనంని పార్టీ అధిష్ఠానం తాజాగా వెంకటగిరి ఎన్నికల ఇన్ చార్జీగా నియమించడంతో.. అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజీనామా సందర్భంగా బొమ్మిరెడ్డి జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వెంకటగిరి నియోజకవర్గంలో వైసీపీ బాధ్యతలు చూస్తున్న తనకు కనీస సమాచారం ఇవ్వకుండా ఆనం రాంనారాయణ రెడ్డిని నియమించడం బాధ కలిగించిందని, ఆ విషయంలో జగన్ తనకు కనీస గౌరవాన్ని కూడా ఇవ్వలేదన్నారు. జగన్ ఓ నియంతలా వ్యవహరిస్తున్నారని, వెంకటగిరిలో పోటీకి రూ.50 కోట్లు ఖర్చువుతాయని, అంత పెట్టుకోగలవా? అని జగన్ అడిగారని ఆరోపించారు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని బొమ్మిరెడ్డి అన్నారు.