పోలీసు కాలర్‌ పట్టుకున్న హెడ్ కానిస్టేబుల్‌ సస్పెండ్

విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌పై మరో కానిస్టేబుల్ గొడవకు దిగడం.. కాలర్ పట్టుకున్న ఘటన జిల్లాలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. 'ఏరా.. నా కొడుకునే కొడతావా...' అంటూ దుర్భాషలాడటంతో పాటు కానిస్టేబుల్‌ చొక్కా పట్టుకొని లాగే ప్రయత్నం చేసిన విచిత్ర ఘటన నెల్లూరు నగరంలోని ఇరుకళలమ్మ ఆలయం పరిధిలో చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న జిల్లా ఎస్పీ.. ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులును సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఎస్ఐ, సీఐలకి ఛార్జి మెమోలు ఎస్పీ జారీ చేశారు.

అసలేం జరిగింది..?

నగరంలోని ఇరుకళలమ్మ ఆలయం దాటిన తరువాత పోలీసులు రోడ్డుపై ఉండగా ఓ యువకుడు ద్విచక్ర వాహనంలో వచ్చాడు. పోలీసులు ఆ యువకుడిపై లాఠీ ఝుళిపించి బైక్‌ తాళాలు లాక్కున్నారు. వెంటనే ఆ యువకుడు తండ్రికి ఫోన్‌ చేసి విషయం తెలిపాడు. తండ్రిని చూసిన ఆ యువకుడు తాను పెట్రోల్‌ కొట్టించుకునేందుకు వచ్చానని, తనకు ఆపరేషన్‌ చేసి రాడ్లు వేశారని ఇలా కొడుతారా అంటూ వాదనకు దిగాడు. ఆ క్రమంలో పోలీసులు ఏరా ఎవరితో వాదిస్తున్నావంటూ దుర్భాషలాడారు. ఈ నేపథ్యంలో ఆ యువకుడి తండ్రి అక్కడకువచ్చి కర్ర పట్టుకొన్న కానిస్టేబుల్‌తో గొడవకు దిగాడు. పక్కనే ఉన్న పోలీసులు, స్థానికులు, కుమారుడు అందరూ కలిసి వారిద్దరిని విడదీశారు.

వీడియో వైరల్ అవ్వడంతో..!

ఆ వ్యక్తి.. 'ఎస్పీ దగ్గరకు వెళుదాం రారా... 144 సెక్షన్‌ ఉంటే కొడతారా.. నా బిడ్డకు రాడ్లు వేసి ఉన్నాయ్. ఏదైనా జరిగి ఉంటే...' అంటూ హడావడిగా ద్విచక్ర వాహనంపై కుమారుడిని ఎక్కించుకొని వెళ్లిపోయాడు. ఈ ఘటనను మొత్తాన్ని పోలీసులతో పాటు అక్కడి స్థానికులు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెట్టారు. ఈ వీడియో రాష్ట్ర వ్యాప్తంగా శనివారం హల్‌చల్‌ చేసింది. ఈ వ్యవహారం ఎస్పీ దృష్టికి వెళ్లడంతో 24 గంటలలోపే ఘటనకు పాల్పడిన కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు.