పవన్ కళ్యాణ్ ఇది కరెక్ట్ సమయమేనా?

 

తిత్లీ తుఫాను శ్రీకాకుళంలో విషాదాన్ని మిగిల్చి వెళ్ళిపోయింది. ఇలాంటి సమయంలో ప్రభుత్వం వారికి అండగా నిలబడింది. సీఎం చంద్రబాబుతో సహా ప్రజాప్రతినిధులు, అధికారులు అక్కడే ఉండి బాధితులకు దైర్యం చెప్పారు. సహాయ సహకారాలు అందించారు. అయితే వైసీపీ అధినేత జగన్, జనసేన అధినేత పవన్ మాత్రం తిత్లీ బాధితులను కనీసం పరామర్శించడానికి కూడా వెళ్ళలేదంటూ విమర్శలు వచ్చాయి. జగన్ అయితే ఇంకా వెళ్ళలేదు కానీ.. పవన్ మాత్రం వెళ్లి పరామర్శించారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ పవన్ మీద ఒక విషయంపై మళ్ళీ విమర్శలు మొదలయ్యాయి.

పవన్ వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లారు. వారిని పరామర్శించి వారి కష్టాలు తెల్సుకున్నారు. వారికి అండగా ఉంటానని మాట ఇచ్చారు. ప్రభుత్వం కూడా అండగా ఉండాలని కోరారు. బాధలో ఉన్న వారికి ఓదార్పునివ్వడం వరకు ఓకే కానీ.. అలాంటి సమయంలో పార్టీ కార్యక్రమాలు నిర్వహించడమే పవన్ పై విమర్శలకు కారణమయ్యాయి. ఒకవైపు పరామర్శించడానికి వెళ్లిన పవన్ మరోవైపు పార్టీలో చేరిక కార్యక్రమాలు కూడా చేపట్టారు. తిరుపతి మాజీ ఎమ్మెల్యే , టీటీడీ మాజీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తిని పార్టీలో చేర్చుకున్నారు. అదే ఊపులో మరికొందరు చోటా నేతల్ని కూడా పార్టీలో చేర్చుకున్నారు. ఒకవైపు అక్కడి వారు బాధలో ఉన్నారు. మీరు వారిని పరామర్శించడానికి వెళ్లారు. మరి ఇలాంటి సమయంలో పార్టీలో చేరిక కార్యక్రమాలు చేపట్టడం కరెక్టేనా పవన్ అంటూ విమర్శలు తలెత్తుతున్నాయి.