అమరావతి మహిళలకు అండగా జాతీయ మహిళా కమిషన్!!

రాజధాని మార్పు అంశం మొదలైన దగ్గర నుంచి ఆంధ్రా అంతటా వాతావరణం వేడెక్కుతోంది.రాజధాని గ్రామాల్లో జాతీయ మహిళా కమిషన్ ప్రతి నిధుల బృందం ఇటీవల పర్యటించింది. తుళ్లూరులో రైతుల మహిళలపై దాడులను కమిషన్ తీవ్రంగా పరిగణిస్తోంది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారి పై లాఠీ చార్జ్ చేయడం అరెస్టులు చేయడం లాంటి వాటి పై క్షేత్రస్థాయిలోనే పర్యటించి నిజనిర్దారణ చేయనుంది ఇవాళ కమిటీని పంపిస్తున్నట్టు NWC చైర్ పర్సన్ రేఖా శర్మ తెలియజేశారు.మహిళలపై పోలీసులు అంత్యంత దారుణంగా దాడి చేసిన ఫోటోలు ట్విట్టర్ ద్వారా ఆమె దృష్టికి వెళ్లడంతో.. ఆమె పోలీసులు, ప్రభుత్వం తీరుపై తీవ్ర అసహనానికి గురైనట్లు తెలుస్తోంది.

మరోవైపు, ప్రభుత్వం ఎంత దారుణంగా వ్యవహరిస్తోందో, పోలీసులు ఎలా దౌర్జన్యాలకు దిగుతున్నారన్న అంశం తమ వద్ద ఉన్న ఆధారాలతో సహా కమిటీ ముందు ఉంచనున్నట్లు మహిళలు తెలియజేశారు. కనకదుర్గమ్మకు పసుపు కుంకుమ నైవేధ్యం సమర్పించేందుకు వెళుతున్న తమతో పోలీసులు వ్యవహరించిన తీరును మహిళా కమిషన్ బృందానికి వివరించబోతున్నారు. పెయిడ్ ఆర్టిస్టులు అంటూ తమను పదేపదే కించపరుస్తున్నారని మహిళలు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మందడం లో జరిగిన దాడితో పాటు నిన్న విజయవాడలో మహిళల ర్యాలీ సందర్భంగా సాగిన దమన కాండను కూడా కమిషన్ ముందుకు తీసుకురానున్నారు. రాజధానికి భూములిచ్చిన తాము న్యాయం కోసం పోరాడుతుంటే అత్యంత దారుణంగా కట్టడి చేయాలని చూస్తున్నారని మహిళలు వాపోతున్నారు. తమ హక్కులను కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు.