ఎన్సీపీ- శివసేన మధ్య చిచ్చు పెడుతోన్న ఎల్గార్ పరిషత్!

మహారాష్ట్రలో బీజేపీతో దశాబ్దాల మైత్రికి స్వస్తి చెప్పి మరీ కాంగ్రెస్ ఎన్సీపీతో కలిసి సర్కారు ఏర్పాటు చేసింది శివసేన. మంత్రి పదవుల పంపకంలో విభేదాలు తప్పవని అందరూ ఊహించినా.. ఆ విషయంలో మిత్రపక్షాలు ఒక తాటిపైకి రావడంతో సమస్య రాలేదు. కానీ, రీసెంట్ గా ఎల్గార్ పరిషత్ కేసు ఎన్ఐఏకు అప్పగించాలని కేంద్రం నిర్ణయం తీసుకోవడం దానికి ఉద్ధవ్ మద్దతు తెలపడంపై ఎన్సీపీ అసంతృప్తిగా ఉంది. అధికారంలోకి రాగానే ఎల్గార్ పరిషత్ కేసులు ఎత్తివేస్తామని ఎన్సీపీ హామీ ఇచ్చింది. కానీ శివసేన అందుకు విరుద్ధంగా నిర్ణయం తీసుకోవడం ఆ పార్టీకి మింగుడు పడలేదు.

అదేవిధంగా సీఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎన్సీపీ నిరసన తెలుపుతున్న తరుణంలో మే నుంచి మహారాష్ట్రలో ఎన్పీఆర్ షురూ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పవార్ కు ఆగ్రహం తెప్పించింది. సీఏఏ, ఎన్పీఆర్ అమలు చేయకుండా ఉండేందుకు ఉన్న న్యాయపరమైన అవకాశాలు చూస్తున్నామని ఎన్సీపీ మంత్రి ఒకరు చెప్పినప్పటికీ.. శివసేన మాత్రం ఈ విషయంలో ముందుకు వెళ్లాలని డిసైడ్ అయ్యింది. ఇప్పటికే ప్రభుత్వంలో ఈ మేరకు ప్రిపరేషన్ కూడా జరిగి పోతున్నాయి. మహారాష్ట్ర కేబినెట్ లో ఉన్న 16 మంది ఎన్సిపి మంత్రులతో శరద్ పవార్ సమావేశమయ్యారు. అంతేకాకుండా ఎన్పీఆర్ మీద గంటపాటు చర్చ నడిచినట్లు తెలుస్తోంది. అటు ఎల్గార్ పరిషత్ విషయంలోనూ చర్చ జరిగినట్లు సమాచారం. మీటింగ్ ముగిసిన కాసేపటికే ఎల్గార్ పరిషత్ కేసును సిట్ తో దర్యాప్తు చేస్తామని ఎన్సీపీ మంత్రి ఆధీనంలో ఉన్న హోంశాఖ ప్రకటించింది. అయితే సిట్ ఎంక్వైరీకి సీఎం పర్మిషన్ ఉందా? ఆయన అనుమతి లేకుండానే విచారణ చేస్తారా? అనేది తేలాల్సి ఉంది.