ఎన్నికల వేళ రెచ్చిపోయిన మావోలు

 

ఛత్తీస్‌గఢ్ లో ఎన్నికలు జరుగుతున్నది విదితమే.అయితే గతంలో ఎన్నికలు బహిష్కరించాలని మావోలు హెచ్చరించారు.కానీ తాజాగా తొలిదశ పోలింగ్‌ ప్రారంభమైంది.ఈ నేపథ్యంలో మావోయిస్టులు రెచ్చిపోయారు.పోలింగ్‌ ప్రారంభం కావడానికి కొద్ది గంటల ముందే మావోయిస్టులు బాంబు దాడికి దిగారు.దంతెవాడ జిల్లాలోని తుమక్‌పాల్‌-నయనార్‌ రోడ్డుపై ఈ ఉదయం 5.30గంటల ప్రాంతంలో నక్సల్స్‌ ఐఈడీని పేల్చేశారు. పోలింగ్‌ విధుల నిమిత్తం వెళ్తున్న భద్రతాసిబ్బంది, ఎన్నికల అధికారులను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు ఈ దాడికి పాల్పడ్డారు. అయితే ఈ ఘటనలో భద్రతాసిబ్బంది, ఎన్నికల అధికారులకు ఎలాంటి హానీ జరగలేదని, వారంతా సురక్షితంగా పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.గత రెండు వారాల్లో ఐఈడీ దాడులకు పాల్పడడం వరుసగా ఇది ఏడోసారి. ఈ దాడుల్లో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. సరిగ్గా ఎన్నికలకు ఒకరోజు ముందు... ఆదివారం కెంకార్ జిల్లాలోని కొయలిబేడలో మావోయిస్టులు శక్తివంతమైన ఐఈడీ బాంబుతో దాడికి దిగారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఓ సీఆర్‌పీఎఫ్ జవాను చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.

మొత్తం 90 స్థానాలున్న శాసనసభలో మొదటిదశలో బీజాపూర్‌, నారాయణ్‌పూర్‌, కాంకేర్‌, బస్తార్‌, సుక్మా, రాజనందగావ్‌, దంతెవాడ జిల్లాలోని 18 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. నక్సల్స్‌ ప్రభావం ఎక్కువగా ఉన్న 10 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ మధ్యాహ్నం 3 గంటల వరకు జరగనుంది. మిగతా 8 చోట్ల ఉదయం 8 గంటలకు మొదలైన పోలింగ్‌ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది.