రైతుల ఆత్మహత్యలపై హెచ్ఆర్‌సీ సుమోటో

 

తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. గడచిన ఐదు నెలల కాలంలో ఇప్పటి వరకు ఆరు వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పటికీ ప్రతిరోజూ నాలుగు నుంచి ఐదుగురు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కరెంటు లేకపోవడం, పంటలు ఎండిపోవడం, అప్పులు పెరిగిపోవడం కారణంగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రైతుల ఆత్మహత్యల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎంతమాత్రం స్పందించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నారు. ఆరు వందల మంది రైతులు మరణించినప్పటికీ ప్రభుత్వం తరఫున ఒక్క రైతును కూడా పరామర్శించలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలను జాతీయ మానవ హక్కుల సంఘం సుమోటోగా స్వీకరించింది. మీడియా కథనాల ఆధారంగా ఈ ఆత్మహత్య ఘటనలను సుమోటోగా స్వీకరించిన మానవ హక్కుల కమిషన్ రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది.