కేసీఆర్ తీరుపై జాతీయ మీడియా ఫైర్.. దిశ ఘటన కంటే పెళ్లి ఎక్కువా?

 

హైదరాబాద్ లో జరిగిన వెటర్నరీ డాక్టర్ దిశ ఘటన దేశవ్యాప్తంగా సంచలమైన సంగతి తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో ప్రజల్లో తీవ్ర ఆగ్రావేశాలు వ్యక్తమవుతున్నాయి. నిందితులకు మరణశిక్ష విధించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే దిశ ఘటన నేపథ్యంలో జాతీయ మీడియా తెలంగాణ సీఎం కేసీఆర్ ని టార్గెట్ చేసింది. ఘటన జరిగిన వెంటనే రాష్ట్ర సీఎంగా కేసీఆర్ స్పందించలేదని విమర్శించిన జాతీయ మీడియా.. తాజాగా ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ ని.. దిశ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు అంటూ మొహం మీదనే నిలదీసింది.

కేసీఆర్‌ ఢిల్లీ వెళ్లిన సంగతి తెల్సిందే. ప్రధాని మోడీ మరియు కేంద్ర మంత్రులని కలవడంతో పాటు.. ఓ వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు. అయితే కేసీఆర్ ని ఢిల్లీ ఎయిర్‌పోర్టులో.. అక్కడి జాతీయ మీడియా ప్రతినిధులు చుట్టుముట్టారు. దిశ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదంటూ నిలదీశారు. కానీ కేసీఆర్.. మీడియా ప్రతినిధులకు ఏ సమాధానం చెప్పకుండానే అక్కడి నుంచి ప్రత్యేక కాన్వాయ్‌లో వెళ్లిపోయారు. దీంతో జాతీయ మీడియా కేసీఆర్ పై విమర్శలు గుప్పిస్తోంది. ఓ వైపు దిశ ఘటన దేశాన్ని కుదిపేస్తుంటే.. సీఎం కేసీఆర్ మాత్రం ఏం పట్టనట్టు ఓ విలాసవంతమైన వివాహ రిసెప్షన్ కోసం ఢిల్లీకి వచ్చారంటూ జాతీయ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేసీఆర్ పై ఇక్కడి మీడియా విమర్శలు చేసే సాహసం చెయ్యట్లేదు కానీ.. జాతీయ మీడియా మాత్రం మాత్రం కేసీఆర్ తీరుపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతోంది.
 
మరోవైపు సోషల్ మీడియాలో కూడా కేసీఆర్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దిశ ఘటన వెలుగులోకి వచ్చిన రోజు కేసీఆర్.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖా నాయక్ కుమార్తె పెళ్లికి హాజరయ్యారు. ఆ మరుసటి రోజు టీఆర్ఎస్ నేత పిడమర్తి రవి వివాహ వేడుకకు కూడా కేసీఆర్ హాజరయ్యారు. దీంతో సీఎంకి వేడుకలకు వెళ్లే టైం ఉంది కానీ, ఘటనపై స్పందించే టైం లేదంటూ నెటిజన్లు విమర్శించారు. ఇక అప్పటివరకు దిశ ఘటనపై స్పందించని కేసీఆర్.. ఆర్టీసీ కార్మికులతో చర్చ సందర్భంగా స్పందించారు. వెంటనే, న్యాయం జరిగేందుకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలంటూ అధికారులను ఆదేశించారు. అయితే ఘటన జరిగిన వెంటనే కేసీఆర్ స్పందించకపోవడం, మరోవైపు దిశ కుటుంబాన్ని ఇంతవరకు పరామర్శించని కేసీఆర్.. వివాహ వేడుకులకు హాజరు కావడంపై.. అటు జాతీయ మీడియా, ఇటు సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.