ప్రమాణానికి బాలకృష్ణ ను ఆహ్వానించిన మోడీ

 

 

 

గుజరాత్ ఎన్నికల్లో ఘన విజయం సాధించి రేపు ముఖ్య మంత్రి పదవిని చేపట్టబోతున్న నరేంద్ర మోడి తన ప్రమాణ స్వీకారోత్సవానికి సినీ నటుడు బాలకృష్ణ ను కూడా ఆహ్వానించారు. ఎన్.టి. రామారావును అమితంగా అభిమానించే మోడి, ఆయన కుమారుడు బాలకృష్ణ ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు.

 

ఎన్టీఆర్ కుమారుడిగా మాత్రమే బాలయ్యను మోడి ఆహ్వానించారని, దీని వెనుక రాజకీయ కారణాలేవీ లేవని వార్తలు వస్తున్నాయి. అయితే, బాలకృష్ణ ప్రస్తుతం తెలుగు దేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్నందున ఈ కార్యక్రమానికి హాజరయ్యే విషయాన్ని ఆయన చంద్ర బాబు తో చర్చించనున్నారని సమాచారం. ఈ కార్యక్రమానికి హాజరయితే, ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయోనని బాలకృష్ణ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయనను ఆహ్వానించాలని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి, మోడిని కోరినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.

 

ఈ విషయంలో తుది నిర్ణయం జరిగితే, ఈ మధ్యాహ్నం బాలయ్య గుజరాత్ కు పయనమవుతారు. ఇంతకు ముందెన్నడూ మోడి, బాలకృష్ణ ను ఆహ్వానించిన దాఖలాలు లేకపోవడంతో, ప్రస్తుతం మోడి ఆలోచన వెనుక ఉన్న అంతరార్ధంఫై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

 

వ్యక్తిగతంగా బాలయ్య ఈ కార్యక్రమానికి హాజరవుతారని భావిస్తున్నపటికీ, బిజెపి కి దూరంగా ఉండాలని భావిస్తున్న తెలుగు దేశంలో ఈ ఆహ్వానం చర్చనీయాంసంగా మారే అవకాశం కాదనలేం.