మోడీ ప్రవేశంతో మారిన లెక్కలు

 

బీజేపీ నరేంద్ర మోడీని తన ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించక ముందు, 2014లో జరగబోయే ఎన్నికలపట్ల ప్రజలు, మీడియా కూడా పెద్ద ఆసక్తి చూపలేదు. ఎందుకంటే ఎన్నికలలో పోటీ చేయనున్న కాంగ్రెస్ పార్టీ పీకల లోతు అవినీతిలో కూరుకుపోగా, ప్రధాని అభ్యర్ధి విషయంలో బీజేపీ అగ్రనేతల మధ్య గొడవలు ప్రజలలో తీవ్ర నిరాశ, నిర్లిప్తతలు కలిగించాయి. కానీ, ఎట్టకేలకు బీజేపీ నరేంద్ర మోడీని తన ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించడంతో హటాత్తుగా పరిస్థితులు మారిపోయాయి. సమర్ధుడు, పరిపాలనాదక్షుడు, అపార రాజకీయ అనుభవంగల నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశంలో పరిస్థితులు మళ్ళీ గాడినపడతాయనే ఆశ, భావన ప్రజలకు కలగడం, దానికి తోడూ నరేంద్ర మోడీ సుడిగాలిలా దేశవ్యాప్తంగా ప్రచారం మొదలుపెట్టడంతో దేశంలో రాజకీయ పరిస్థితులలో ఒక్కసారిగా మారిపోయాయి.

 

దానితో ఉలిక్కిపడి లేచిన కాంగ్రెస్ అధిష్టానం మోడీని ఏదోవిధంగా అప్రదిష్టపాలు చేసేందుకు విశ్వప్రయత్నాలు చేసింది. కానీ, నాలుగు రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలలో మోడీ ప్రభంజనం ముందు కాంగ్రెస్ ప్రయత్నాలు గాలికి కొట్టుకుపోయాయి. ఆ తరువాత మోడీకి కోర్టులు కూడా ‘క్లీన్ చిట్’ ఇవ్వడంతో ఇక కాంగ్రెస్ చేసేదేమీలేక, యువరాజు రాహుల్ గాంధీకి పట్టాభిషేక మహోత్సవం నిర్వహించి, కాంగ్రెస్ ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించాలని అనుకొంది. ముందుగా ప్రధాని డా.మన్మోహన్ సింగ్ చేత ‘స్వచ్చంద పదవీ విరమణ’ ప్రకటన కూడా చేయించింది. పట్టాభిషేక మహోత్సవం కూడా నిర్వహించింది. కానీ, రాహుల్ గాంధీని తమ ప్రధాని అభ్యర్ధి గా ప్రకటించే సాహసం మాత్రం చేయలేకపోయింది. ఆవిధంగా ప్రకటిస్తే ప్రజలు అతనిని మోడీతో పోల్చి చూసుకొంటే మరింత తేలిపోయే ప్రమాదం ఉందని భావించడమే అందుకు కారణంగా కనబడుతోంది. అందువల్ల ఎన్నికలలో రాహుల్ గాంధీ పార్టీకి సారధ్యం వహిస్తారనే చిన్న ప్రకటనతో సరిపెట్టుకొంది. కనీసం అప్పుడు కూడా పార్టీ గెలుపోటములకు ఆయనే పూర్తి భాద్యత వహిస్తారని ఎవరూ దైర్యంగా ప్రకటించలేకపోవడం కాంగ్రెస్ దీనస్థితికి అద్దం పడుతోంది.

 

ఇంతవరకు వెలువడిన దాదాపు డజనుపైగా సర్వే నివేదికలలో ఏ ఒక్కటి కూడా కాంగ్రెస్ గెలుస్తుందని కానీ, కనీసం గెలిచే అవకాశముందని కానీ ద్రువీకరించకపోవడం విశేషం.తాజాగా టైమ్స్-సి ఓటర్ సంస్థ నిర్వహించిన సర్వేలో కూడా బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే కూటమి ఎన్నికలలో గెలిచే అవకాశం ఉందని మరోమారు ద్రువీకరించింది. ఆ నివేదిక ప్రకారం త్వరలో జరుగనున్న కాంగ్రెస్ పార్టీ కేవలం 89 సీట్లు, బీజేపీ 202 సాధించుకొనే అవకాశమున్నట్లు ప్రకటించింది.