కొత్త స్నేహితులకోసం మోడీ ప్రయత్నాలు ఫలించేనా

 

బీజేపీ కొత్త రధ సారధిగా నరేంద్ర మోడీ పేరు ఖాయం చేయగానే, ఆ పార్టీకి బీహార్ లో మంచి బలమయిన స్నేహితుడిగా పేరున్ననితీష్ కుమార్ బీజేపీ అధ్వర్యంలో నడుస్తున్న ఎన్డీయే కూటమి నుండి తప్పుకోవడంతో, ఆ లోటును తిరిగి భర్తీ చేయవలసిన భాద్యత సహజంగానే మోడీపై పడింది.

 

అందుకే నిన్న హైదరాబాద్ లో జరిగిన నవభారత్ యువ భేరీ సభలో ప్రసంగిస్తూ స్వర్గీయ యన్టీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తి, కాంగ్రెస్ పార్టీని దేశం నుండి తరిమి కొట్టడమే ఆయనకు అసలయిన నివాళి అవుతుందని, అందువలన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేఖంగా ఆయన నెలకొల్పిన తెదేపా ఆయన అడుగుజాడలలో నడుస్తుందో లేదో తేల్చుకోవాలని అన్నారు. భారత దేశాన్ని కాంగ్రెస్ కబంధ హస్తాల నుండి విముక్తి కల్పించే యుద్ధంలో తెదేపా కూడా పాలు పంచుకోవాలని చెపుతూ తమ ఇద్దరి ఉమ్మడి శత్రువు కాంగ్రెస్ పార్టీయే గనుక, తమతో చేతులు కలపాలని ఆయన పరోక్షంగా తేదేపాకు సూచించారు.

 

ఇక అదేవిధంగా తమిళనాడులో కరుణానిధికి చెందిన డీయంకే పార్టీతో కాంగ్రెస్ పోత్తుపెట్టుకొనే అవకాశం ఉంది గనుక, ఆ పార్టీని తీవ్రంగా వ్యతిరేఖించే ఎ.ఐ.ఎ.డీ.యం.కే. పార్టీ అధినేత్రి మరియు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను ప్రసన్నం చేసుకొనేందుకు మోడీ తన ప్రసంగంలో గట్టి ప్రయత్నమే చేసారు. కాంగ్రెస్ పార్టీకి గుజరాత్ రాష్ట్ర అభివృద్ధిని ఆదర్శంగా తీసుకోవడానికి నామోషీగా ఉంటే, పొరుగునున్న జయలలిత పాలిస్తున్నతమిళనాడుని ఆదర్శంగా తీసుకోవాలని ఆయన హితవు పలికారు. తద్వారా తమిళనాడులో తమ పార్టీ ఎ.ఐ.ఎ.డీ.యం.కే.తో స్నేహంచేసే ప్రయత్నం చేసారు.

 

ఇంతవరకు బీజీపీ దక్షిణాదిన కేవలం కర్ణాటకలో మాత్రమే కాలుపెట్టగలిగింది. కానీ, ఎడ్యురప్ప పుణ్యమాని దానిని కూడా ఇటీవల జరిగిన ఎన్నికలలో పోగొట్టుకొని, మళ్ళీ మొదటికొచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో బీజేపీ మళ్ళీ దక్షిణాదిన నిలద్రొక్కుకోవడానికే మోడీ వ్యూహాత్మకంగా అన్ని సంస్కృతుల సమ్మేళనంగా ఉన్న హైదరాబాదును ఎంచుకొన్నారని అర్ధం అవుతోంది.

 

అయితే రానున్న కాలంలో ఆయన దేశప్రజలపై ఏమేరకు ప్రభావం చూపగలరనే దాని మీదనే ఆధారపడి కొత్త స్నేహితులు ఏర్పడుతారు తప్ప, ఆయన పొగడ్తలకు చంద్రబాబు, జయలలిత వంటి వారు అంత తొందరగా పడిపోయే అవకాశం లేదు. ఏమయినప్పటికీ, మోడీ వారందరికీ ‘ద్వారములు తెరిచేయే ఉంచెను’ అని చెప్పకనే చెప్పారు.