మోడీని కలిసేందుకు క్యూ కట్టిన తెలుగు సినీ పరిశ్రమ

 

ఈ రోజు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ లో ‘నవ భారత్ యువ భేరి’ బహిరంగ సభలో ప్రసంగించేందుకు హైదరాబాద్ చేరుకొన్నారు. ఆయనను కలుసుకొనేందుకు తెలుగు చిత్ర సీమకు చెందిన ప్రముఖులు చాలా మంది తరలి రావడం విశేషం.

 

ఆయన కలిసిన వారిలో డా.డీ.రామానాయుడు, కే.రాఘవేంద్ర రావు, రామ్ గోపాల్ వర్మ, వీవీ వినాయక్, కోట శ్రీనివాస రావు, మంచు మోహన్ బాబు కుటుంబ సభ్యులు, కృష్ణం రాజు, కీరవాణి, రవి తేజ, ఆలి, నిర్మాత సి. కళ్యాణ్, జగపతి బాబు తదితతరులున్నారు.

 

తెలుగు చిత్ర సీమలో దాదాపు 70 శాతం మంది సీమాంధ్ర జిల్లాలకు చెందినవారే కావడంతో, రాష్ట్ర విభజనపై సీమాంధ్ర ప్రాంతంలో ఉద్యమాలు జరుగుతున్న ఈ తరుణంలో వారందరూ మోడీని కలవడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకొంది. వారు రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీని వ్యతిరేఖిస్తూ మోడీకి మద్దతుగా నిలుస్తున్నామని తెలిపేందుకు కలిసారా? లేక రాష్ట్ర విభజనకు మద్దతునిచ్చిన బీజేపీ తరపున ఆయనను హైదరాబాద్ విషయంలో రెండు ప్రాంతాల మధ్య చెలరేగుతున్న వివాదంపై తన ప్రసంగంలో ప్రస్తావించామని కోరేందుకే వెళ్లి కలిసారా? లేక బీజేపీ ప్రధాని అభ్యర్ధిగా చెప్పబడుతున్నఆయనను కేవలం మర్యాదపూర్వకంగా కలిసారా? అంటే వేర్వేరు వ్యక్తులు వేర్వేరు కారణాలతో కలిసి ఉండవచ్చును.

 

ఏమయినప్పటికీ, ఇంత మంది సినీ ప్రముఖులు నరేంద్ర మోడీని కలవడానికి ఉత్సుకత చూపించడం రానున్నఎన్నికలలో వారిలో కొందరయినా బీజేపీలో చేరే అవకాశం ఉందని చెప్పవచ్చును. హాస్య నటుడు ఆలీపై రాజకీయాలలో ప్రవేశిస్తున్నట్లు కొద్దిరోజుల క్రితమే మీడియాలో వార్తలు రావడం, వాటిని ఆయన ఖండించడం అందరూ ఎరిగిన విషయమే. కానీ, నేడు ఆయన కూడా మోడీని కలవడం ఆ వార్తలకు బలం చేకూరుస్తోంది.