కాంగ్రెస్ ఎత్తులకు మోడీ పైఎత్తు

 

తెరాస చేతిలోంచి తెలంగాణా ఉద్యమాన్ని చివరి నిమిషంలోవచ్చికాకిలా తన్నుకుపోయిన కాంగ్రెస్ పార్టీ, అదే విధంగా తెలంగాణా రాష్ట్ర ప్రకటనతో మోడీ చేతిలోంచి కూడా తెలంగాణా అంశం ఎత్తుకుపోయింది.

 

మోడీ ఈనెల 11న హైదరాబాదులో ప్రత్యేకంగా తెలంగాణా యువతని ఉద్దేశించి మాట్లాడేందుకే ఒక భారీ సభకు హాజరవనున్నారు. అందులో తెలంగాణా అంశంపై కాంగ్రెస్ అనుసరిస్తున్న కపట వైఖరిని ఎండగట్టి, వచ్చే ఎన్నికలలో బీజేపీకి ఓటేసి అధికారం ఇస్తే, ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మొట్టమొదటగా తెలంగాణా ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేయాలని భావించారు.

 

అయితే, గత 9 ఏళ్లుగా ఈ సమస్యను పరిష్కరించకుండా సాగదీస్తున్నకాంగ్రెస్ పార్టీ గత వారం రోజులుగా రేయనక పగలనక ఓవర్ టైం చేసి మరీ, తెలంగాణా ప్రకటన చేసిందని మోడీ విమర్శించడం గమనిస్తే, కాంగ్రెస్ మోడీ హైదరాబాదు పర్యటనను డెడ్ లైన్ గా పెట్టుకొని పని చేసి ప్రకటన చేసినట్లు అనిపిస్తుంది. కానీ, మోడీ తన వాగ్దానంతో తెలంగాణా ప్రజలను తన వైపుకి తిప్పేసుకోగలడని చెప్పడం సరికాకపోయినా ఆప్రాంతంలో కాంగ్రెస్  ఓటు బ్యాంకుకి ఎంతో కొంత మేర నష్టపరచ గలిగేవారనేది మాత్రం సత్యం. అందువల్ల, ఆయన హైదరాబాద్ పర్యటన కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఎంతో కొంత ఒత్తిడి పెంచే ఉండవచ్చును.

 

స్థానిక బీజేపీ నేతలు, “మోడీ తెలంగాణపై వాగ్ధానం చేసి ప్రజలను ఎక్కడ ఆకట్టుకొంటాడో అనే భయంతోనే కాంగ్రెస్ అంత కష్టపడిందని, లేకుంటే ఎన్నికల వరకు ఈ తంతు కొనసాగుతూనే ఉండేదని” వాదిస్తున్నారు. వారి వాదనల సంగతెలా ఉన్నపటికీ, కాంగ్రెస్ మాత్రం తన ప్రకటనతో మోడీ చేతిలో ఉన్న ఒక బ్రహ్మాస్త్రం వంటి అంశాన్ని తెలివిగా ఎత్తుకుపోయిందని ఖచ్చితంగా చెప్పవచ్చును.

 

అయితే, మోడీ కూడా ఏమి తెలివి తక్కువవాడేమికాదు. ఆయన హైదరాబాద్ లో తన బహిరంగ సభ తరువాత తెలంగాణా లో విస్తృతంగా పర్యటించి తెలంగాణా అంశంతో పార్టీకి బలం చేకూర్చాలని అనుకొన్నారు. కానీ మారిన పరిస్థితుల్లో ఆయన ఇప్పుడు తెలంగాణా ప్రాంతాలకు బదులు, కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహంతో ఉన్న ఆంధ్ర రాయలసీమ ప్రాంతాలలో పర్యటించి విస్తృతంగా సభలు నిర్వించాలని కొత్త వ్యూహం రచించారు.

 

హైదరాబాద్ తరువాత, ముందుగా తిరుపతి, అనంతపురం పట్టణాలలో ఆ తరువాత వెనువెంటనే, విజయవాడ, రాజమండ్రీ, విశాఖపట్నంలలో సభలు నిర్వహించేందుకు సిద్ధపడుతున్నారు. తద్వారా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న సీమంధ్ర ప్రజలను తమవైపుకు తిప్పుకోవాలని ఆయన ఆలోచన చేస్తున్నట్లు అర్ధం అవుతోంది. అయితే, తెలంగాణా ప్రాంతంలో ఆయనకు అడ్డుకట్ట వేయగలిగిన కాంగ్రెస్ మరిప్పుడు సీమంధ్ర ప్రాంతంలో ఏవిధంగా నిలువరిస్తుందో చూడాలి.